విదేశాంగ కార్యదర్శిగా వినయ్ మోహన్ క్వాత్రా

తదుపరి విదేశాంగ కార్యదర్శిగా నేపాల్‌లో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రాను భారత  ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఉన్న హర్షవర్ధన్ ష్రింగ్లా ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయడంతో ఆయన విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

క్వాత్రాకు ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారిగా వివిధ రకాల హోదాలలో దాదాపు 32 సంవత్సరాల అనుభవం ఉంది. ఆయన భారత రాయబారిగా ఫ్రాన్స్‌కు వెళ్లే ముందు 2015 నుండి 2017 వరకు ప్రధాని నరేంద్ర మోదీ  కార్యాలయంలో పనిచేశారు.

1993 నుండి  2003 మధ్య, ఆయన ఐక్యరాజ్యసమితితో వ్యవహరించే ప్రధాన కార్యాలయంలో డెస్క్ ఆఫీసర్‌గా పనిచేశారు.  తరువాత దక్షిణాఫ్రికా, ఉజ్బెకిస్తాన్‌లోని దౌత్య కార్యకలాపాలలో పనిచేశారు. 2003 నుండి 2006 మధ్య,  బీజింగ్ రాయబార కార్యాలయంలో కౌన్సెలర్‌గా,  తరువాత డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌గా పనిచేశారు. 

 
 2006 నుండి 2010 వరకు, ఆయన నేపాల్‌లోని సార్క్ సెక్రటేరియట్‌లో ట్రేడ్, ఎకానమీ, ఫైనాన్స్ బ్యూరో అధిపతిగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. మే 2010 నుండి జూలై 2013 వరకు,  వాషింగ్టన్‌లోని రాయబార కార్యాలయంలో మంత్రి (వాణిజ్యం)గా పనిచేశాడు. 
 
జూలై 2013 నుండి అక్టోబర్ 2015 మధ్య వరకు, క్వాత్రా విదేశాంగ మంత్రిత్వ శాఖ పాలసీ ప్లానింగ్ & రీసెర్చ్ విభాగానికి నాయకత్వం వహించారు. తరువాత విదేశాంగ మంత్రిత్వ శాఖలో అమెరికా విభాగానికి అధిపతిగా పనిచేశారు. అక్కడ అతను అమెరికా, కెనడాలతో భారతదేశ సంబంధాలను పర్యవేక్షించేవారు.

అక్టోబర్ 2015 నుండి ఆగస్టు 2017 వరకు, క్వాత్రా భారత ప్రధాన మంత్రి కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. ఆగస్టు 2017 నుండి ఫిబ్రవరి 2020 వరకు,  ఫ్రాన్స్‌లో భారత రాయబారిగా ఉన్నారు.  మార్చి 2020 నుండి ఇప్పటి వరకు నేపాల్‌లో భారత రాయబారిగా పనిచేస్తున్నారు.