గోరఖ్‌పూర్ గుడి వద్ద పోలీసులపై దాడి

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోని ఓ దేవాలయం వెలుపల ఇద్దరు పోలీసులపై ఓ ఐఐటి గ్రాడ్యుయెట్ మారణాయుధాలతో దాడి జరిపాడు. ఈ వ్యక్తి మతపరమైన నినాదాలు చేస్తూ గుడిలోపలికి ప్రవేశించేందుకు యత్నించాడు. అడ్డొచ్చిన పోలీసులపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 
ఆదివారం రాత్రి 7 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలయం ముందున్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించాడు. అడ్డుకున్న ఇద్దరు భద్రతా సిబ్బందిని వెంట తెచ్చుకున్న కొడవలితో గాయపరిచాడు. ఈ ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం లేకపోలేదని, ఈ కోణంలో నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. 
 
దుండగుడిని అక్కడున్న జనం పట్టుకుని, చేతిలో ఉన్న ఆయుధాన్ని లాగెసుకున్నారు. ఆ సమయంలో  భక్తులతో ఆలయ ప్రాంగణం నిండి ఉందని పోలీసులు తెలిపారు. పథకం ప్రకారమే అక్కడికి చేరుకున్న ముర్తజా ఆలయం లోపలికి ప్రవేశించి ఉంటే జరిగే పరిణామాన్ని ఊహించలేమన్నారు. అతడి వద్ద లభ్యమైన పత్రాలు సంచలనం కలిగించేవిగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
 
 గోరఖ్‌నాథ్ మఠానికి ప్రధాన కేంద్రంగా ఉండే ఆలయం వద్ద అహ్మద్ ముర్తాజా అబ్బాసీ అనే ఈ వ్యక్తి కత్తి దూసి లోపలికి చొచ్చుకుని వెళ్లే యత్నం చేశాడరని వెల్లడైంది. ఈ గోరఖ్‌పూర్ ఆలయానికి ప్రధాన పూజారి హోదాలో ఇప్పటికీ ఉత్తర ప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యానాథ్ వ్యవహరిస్తున్నారు. 
 
ముర్తాజా వద్ద కత్తి ఉండటంతో అక్కడున్న వారు ఆయనపై రాళ్లు విసిరారు. నిరాయుధులను చేశారు. దాడికి దిగిన యువకుడు గోరఖ్‌పూర్ నివాసియే. 2015లో బొంబాయి ఐఐటి నుంచి గ్రాడ్యుయెట్ అయ్యారు. ఈ వ్యక్తి వద్ద లాప్‌టాప్, ఓ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ యువకుడు పోలీసులపై దాడిచేయడంతో పాటు తన చేతుల్లో ఉన్న తల్వార్‌ను ఝుళిపిస్తూ అక్కడున్న జనంపై విరుచుకుపడుతూ ఉండటం అక్కడి వీడియో దృశ్యాలలో రికార్డు అయింది.