శ్రీలంక అధ్యక్ష భవనం ముట్టడి… రాజపక్స రాజీనామాకై డిమాండ్ 

ఏడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనిరీతిలో శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైనందుకు అధ్యక్షుడు రాజపక్సా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ఆ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్న దృష్యా ఎమర్జెన్సీని ప్రకటించినట్లు తెలుస్తోంది. 
 
అధ్యక్షుని నివాసం వెలుపల గురువారం వందలాదిమంది ఆందోళనకారులు గుమిగూడి నిరసన తెలియజేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొను పరిస్థితులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ పోలీసులపైకి రాళ్లు విసిరారు, కొన్ని వాహనాలకు నిప్పంటించారు. ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. తక్షణమే అధ్యక్షుడు రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. దాంతో 45 మందిని అదుపులోకి తీసుకున్నారు.
 
 తమను చెదరగొట్టడానికి పోలీసులు తెచ్చుకున్న వాటర్‌ క్యానన్‌ (జల ఫిరంగి) ట్ర క్కును ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటలవరకూ ఆ ప్రాంతంలో కర్ఫ్యూ వి ధించారు.
 
 కాగా, ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకను కారు చీకట్లు కమ్ముకుంటున్నాయి. రోజుకు 13 గంటలకు పైగా కరెంటు కోతలతో తీవ్రం గా ఇబ్బంది పడుతున్నారు! విద్యుత్‌ కోతల కారణంగా స్టాక్‌ మార్కెట్లలో లావేదేవీలు రోజుకు రెండు గంటలు మాత్రమే కొనసాగుతున్నాయి. 
 
ఉన్న విద్యుత్‌ను ఆదా చేసుకునే క్రమంలో.. వీధి దీపాలూ ఆర్పేస్తున్నామని ఆ దేశ విద్యుత్‌ మంత్రి పవిత్రా వన్నియారచ్చి ప్రకటించారు. భారత్‌ అప్పుగా అందిస్తున్న రూ.38 వేల కోట్ల విలువైన డీజిల్‌.. శనివారం నాటికి చేరుకుంటుందని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇండియన్‌ ఆయిల్‌ సంస్థ.. 6 వేల టన్నుల డీజిల్‌ను శ్రీలంకకు అందించనుంది.
 
ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. శ్రీలంకను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసింది. ఆ దేశ ప్రధాన ఆదాయ వనరు అయిన పర్యాటకం కుప్పకూలడంతో.. విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటి పోయాయి. దీంతో విద్యుదుత్పత్తికి కావాల్సిన ఇంధన దిగుమతులు నిలిచిపోయాయి. 
 
ద్రవ్యోల్బణం 18.7 శాతానికి చేరింది. ఆహార కొరత 30.2 శాతానికి చేరుకుంది. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రాణాధారమైన ఔషధాల నుంచి పెట్రో ఉత్పత్తుల వరకు.. నిర్మాణాలకు వినియోగించే సిమెంటు నుంచి అన్నింటికీ తిప్పలే. ఎప్పుడో 1970లో దారుణ పరిస్థితులను చూసిన శ్రీలంకను.. మళ్లీ ఇప్పుడు అంతకు మించిన కష్టాలు చుట్టుముట్టాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజ లు.. ప్రభుత్వ అసమర్ధ నిర్ణయాలే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు.