ఉగ్రవాదిగా మారిన మాజీ జర్నలిస్ట్ కాశ్మీర్ లో హతం 

జమ్మూకశ్మీరులో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. శ్రీనగర్‌లోని రైనావారి ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. 

ఉగ్రవాదుల్లో ఒకరైన రయీస్ అహ్మద్ భట్ అనంత్‌నాగ్‌లో ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ ‘వ్యాలీ న్యూస్ సర్వీస్’ను నడుపుతున్న మాజీ జర్నలిస్టు అని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. భట్ గత సంవత్సరం ఆగస్టులో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్ధలో చేరాడని, ఇతన్ని జమ్మూకశ్మీర్ పోలీసులు టెర్రరిస్టుల జాబితాలో చేర్చారు.

ఉగ్రవాద నేరాలకు సంబంధించి అహ్మద్ భట్ పై ఇప్పటికే రెండు కేసులు నమోదైనట్లు పోలీసులు  ఉగ్రవాద నేరాల్లో మాజీ జర్నలిస్ట్ ప్రమేయం ఉందని, మీడియాను దుర్వినియోగం చేసినట్లు తేలిందని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు

.కాల్పుల్లో మరణించిన వారు నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సంస్థకు చెందిన వారని,  వారిలో ఒకరి వద్ద మీడియా గుర్తింపు కార్డు ఉందని కశ్మీర్ జోన్ పోలీసులు అధికారికంగా ట్వీట్ చేశారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన మరో ఉగ్రవాదిని బిజ్‌బెహరా నివాసి హిలాల్ అహ్మద్ రహమ్‌గా గుర్తించారు.

హిలాల్ కూడా ‘సి’ కేటగిరీ ఉగ్రవాది.వీరిద్దరూ ఇటీవల పౌర హత్యలతో సహా పలు ఉగ్రవాద నేరాల్లో పాల్గొన్నారని విజయ కుమార్ చెప్పారు.ఎన్‌కౌంటర్ స్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రితో సహా పలు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.