హిందూ దేవతలను దూషిస్తే ట్విట్టర్ ఖాతాలు తొలగించారా?

హిందూ దేవతలపై పదే పదే దూషణలు చేస్తున్న ఖాతాలను ఎందుకు తొలగించడం లేదని ట్విట్టర్‌ను సోమవారం ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతా తొలగించినప్పుడు ఇండియాలో ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని అడిగింది. 
 
ఇతర మతాల, ఇతర ప్రాంతాల ప్రజల సున్నిత మనస్తత్వాల గురించి ట్విట్టర్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్విట్టర్‌లో ‘ఏతీష్ట్ రిపబ్లిక్, మా కాళి’ అనే ఖాతాలు సహా అనేక ఖాతాల నుంచి హిందూ దేవతలపై అభ్యంతరకర విమర్శలు వస్తున్నాయని ఒక వ్యక్తి వేసిన పిటిషన్‌ను హైకోర్టు చీఫ్ జస్టిస్ విపిన్ సంఘి, జస్టిన్ నవీన్ చల్వీ విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ హిందూ దేవతలపై విమర్శలు చేస్తున్న వారి ఖాతాల తొలగింపుపై ట్విట్టర్‌ను నిలదీసింది. దీనికి ట్విట్టర్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ‘‘ఆయా ఖాతాల నుంచి అన్ని రకాల ట్వీట్లు వస్తున్నాయ’’ని పేర్కొన్నారు. దీనికి కోర్టు స్పందిస్తూ ‘‘ఇది లాజిక్ అయితే మరి ట్రంప్ ఖాతాను ఎందుకు తొలగించారు?’’ అని ఎదురు ప్రశ్న వేసింది.
‘‘మీకు సంబంధించిన ప్రజలకు వ్యతిరేకంగా ఏదైనా కంటెంట్ అప్‌లోడ్ అయితే ఆ ఖాతాలను తొలగిస్తారు. అదే ఇతర ప్రాంతాల, మతాల వారికి వ్యతిరేకంగా ఉంటే అదే స్థాయిలో చర్యలు తీసుకోలేకపోతున్నారు” అంటూ ట్విట్టర్ ద్వంద వైఖరిని ప్రశ్నించారు. 
 
“ప్రపంచంలోని ఇతర మతాలు, ప్రజల గురించి కూడా ఆలోచించాలి. వేరే మతానికి సంబంధించి ఇలాంటి కంటెంట్ వస్తే, మీరు (ట్విట్టర్) మరింత జాగ్రత్తగా, మరింత సున్నితంగా ఉంటారని అనుకుంటున్నాము’’ అని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.