రణరంగంగా మారిన బెంగాల్ అసెంబ్లీ

బెంగాల్ అసెంబ్లీ రణరంగంగా మారింది. బీర్భూమ్ ఘటనపై అధికార, ప్రతిపక్షాల మధ్య మొదలైన వాగ్వాదం ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి వెళ్లింది. నిండు సభ సాక్షిగా ప్రజా ప్రతినిధులమన్న విషయాన్ని మర్చిపోయి రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు. 

 రాంపూర్‌హాట్‌, బీర్భూమ్‌ హింసాత్మక ఘటనలపై చర్చలు జరపాలంటూ బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్షనేత సువేందు అధికారి డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ పోడియం వద్ద నిరసనలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో టీఎంసీ, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలు ఒకరినొకరు కొట్టుకున్నారు.

ఈ గొడవలో బీజేపీ ఎమ్మెల్యే మనోజ్‌ తిగ్గ బట్టలు చిరిగిపో.. టీఎంసీ ఎమ్మెల్యే అసిత్‌ మజుందర్‌ ముక్కుకు గాయమైంది.  దీంతో వెంటనే ఆయనను హాస్పిటల్కు తరలించారు. ప్రతిపక్ష నేత సువేందు అధికారి తనపై దాడి చేశాడని ఆయన ఆరోపించారు. 

దాడి నేపథ్యంలో ప్రతిపక్ష నేత సువేందు అధికారితో పాటు మరో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ ఈ ఏడాది చివరి వరకు సస్పెండ్ చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటన చేయాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు.

సభలో జరిగిన రభసకు సంబంధించిన వీడియోను బీజేపీ నేతలు బయటపెట్టారు. ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్య, పార్టీ ప్రతినిధి షెహజాద్ జై హింద్ తో పాటు ఇతర ఎమ్మెల్యేలను తృణమూల్ నేతలు చుట్టుముట్టగా వారిని విడిపించేందుకు మార్షల్స్, పోలీసులు ప్రయత్నిస్తున్న దృశ్యాలు అందులో ఉన్నాయి.