బీర్భూమ్‌ ఘటనలో 21 మందిని నిందితులుగా పేర్కొన్న సిబిఐ

బెంగాల్‌లోని బీర్భూమ్‌ ఘటన కేసులో 21మందిని సిబిఐ నిందితులుగా పేర్కొంది. కాగా, రాష్ట్ర పోలీసుల జాబితాలో నిందితులుగా ఉన్నవారే అందులోనూ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 
 
ఈ మారణకాండకు కారణమైన తృణమూల్‌ కాంగ్రెస్‌ బ్లాక్‌ ప్రెసిడెంట్‌ అనరుల్‌ హుస్సేన్‌ను సిబిఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా, అతడిని అరెస్టు చేసే అవకాశాలున్నాయి.
 
బీర్భూమ్‌లోని రాంపూర్‌హాట్‌ పట్టణానికి సమీపంలోని భక్తు గ్రామంలో సోమవారం అనేక ఇళ్లు దగ్దమవ్వగా.. ఎనిమిది మంది చనిపోయారు. కాగా, వీరంతా మంటల్లో కాలడానికి ముందే అత్యంత దారుణంగా హింసించినట్లు తేలింది. 
 
టిఎంసి స్థానిక నేత హత్య తరువాత ఈ దారుణం చోటుచేసుకుంది. అయితే నిందితులకు సహకరించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న అనరుల్‌ను పట్టిస్తానని భక్తు గ్రామాన్ని సందర్శించినప్పుడు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హామీనిచ్చారు. 
 
 శనివారం బీర్‌భూమ్‌ హింసాకాండకు సంబంధించి విచారణ జరిపేందుకు డీఐజీ అఖిలేష్ సింగ్ నేతృత్వంలోని సీబీఐ టీం, ఫోరెన్సిక్ టీం రాంపూర్ హట్ గ్రామాన్ని సందర్శించింది. 15 సభ్యులతో కూడిన సీబీఐ టీమ్ ఈ హత్యాకాండపై దర్యాప్తు చేస్తోంది.
 
కాగా, ఈ ఘటనలో ఇప్పటి వరకు 20 మందిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసు సిబిఐ చేతికి వెళ్లింది. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిని సిబిఐ సందర్శించింది. ఏప్రిల్‌ 7న కోల్‌కతా హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది.