భారత్ లో జిహాద్… ఐఎస్  గ్రూప్ వీడియో  

తీవ్రవాద సంస్థ ద ఇస్లామిక్ స్టేట్ దేశంలో మళ్లీ అరాచకాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కొత్తగా రిక్రూట్ చేసుకున్న సభ్యులతో భారత్ లో జిహాద్ అమలు చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం మూడు గ్రూపులు పనిచేస్తాయని చెప్పింది. 
 
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) గ్రూప్‌నకు చెందిన ‘ఇస్లామిక్ స్టేట్ హింద్ ప్రావిన్స్’ గ్రూప్ పేరుతో ఈ నెల 25న టెలిగ్రామ్‌లో ఒక వీడియో విడుదలైంది. చేతిలో ఆయుధాలు పట్టుకుని, ముఖానికి ముసుగులు ధరించిన కొందరు తీవ్రవాదులు దేశంలో జిహాద్ అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్న దృశ్యం ఆ వీడియోలో కనిపిస్తుంది.
 
 వీళ్లందరినీ దేశంలోనే రిక్రూట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంటెలిజెన్స్‌కు అందకుండా వీడియోలో వాళ్ల కళ్లు బ్లర్ చేశారు. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాది అబ్ తురాబ్ అల్ హింది మాట్లాడుతూ దేశంలో చాలా మంది ఐఎస్‌లో చేరారని చెప్పాడు. ఈ వీడియోను విశ్లేషించిన సైబర్ నిపుణులు, వీడియో తీసింది కాశ్మీర్‌లో అని, పోస్ట్ చేసింది మాత్రం పాకిస్తాన్ నుంచి అని గుర్తించారు. 
 
వీడియోలో కనిపించిన వాళ్లు అమాయకుల ప్రాణాలు తీసే లక్ష్యంతో పనిచేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. కాశ్మీర్‌లో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలే టార్గెట్‌గా ఈ గ్రూపులు పనిచేస్తున్నాయని అంచనా. నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తీసుకున్న చర్యలతో దాదాపు రెండేళ్లుగా ఐఎస్ కార్యకలాపాలు సాగించడం లేదు. అయితే, తాజా వీడియోతో ఈ గ్రూప్ మళ్లీ యాక్టివ్ అవుతున్నట్లు తెలుస్తోంది.