మయన్మార్‌ పై అమెరికా, బ్రిటన్‌, కెనడా సరికొత్త ఆంక్షలు

మయన్మార్‌లో హింసాత్మక పాలకు నిరసనగా సరికొత్త ఆంక్షలకు అమెరికా, బ్రిటన్‌, కెనడా సిద్ధమయ్యాయి. వైమానికి దళానికి కొత్తగా నియమితులైన చీఫ్‌ జనరల్‌ హ్తున్‌ ఆంగ్‌తో సహా సైనిక అధికారులపై ఆంక్షలు విధించాయి.  ఆయుధ వ్యాపారాలతో సంబంధం ఉన్న వారిపైనా దృష్టి సారించాయి.
వీరితో సంబంధం ఉన్న మూడు మయన్మార్‌ ఆయుధ డీలర్లు, కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. 66వ లైట్‌ ఇన్‌ఫాంట్రీ డివిజన్‌పై కూడా అమెరికా చర్యలకు ఉపక్రమించింది.  గత ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా కయా రాష్ట్రంలో 30 మంది పౌరులకు చావుకు కారణమైన ఈ ఆర్మీ యూనిట్‌పై ఆంక్షలు విధించింది.
 మయన్మార్‌లో ఆర్మీ పాలనతో పెరుగుతున్న హింసకు ప్రతిస్పందనగా.. ఆ దేశ ప్రజలకు మద్దతునిస్తూ.. తిరుగుబాటు, పాలన హింసకు సంబంధించి జవాబుదారీతనాన్ని ప్రోత్సహించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్‌ ఓ ప్రకటనలో తెలిపారు.
మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే వరకు ఆ ఆంక్షలు కొనసాగుతాయని హెచ్చరించారు. వైమానికి దళానికి ఆయుధాలను సరఫరా చేస్తున్న ఆయుధ డీలర్లు, కంపెనీలపై బ్రిటన్‌ దృష్టి సారించింది. ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ప్రజలపై మయన్మార్‌ జుంటా ఆర్మీ జరిపిన హింసాత్మక దాడి కారణంగా ఈ దేశాలు ఈ ఆంక్షలు విధించాయి.
కెనడా కూడా హ్టున్‌ ఆంగ్‌తో పాటు నలుగురు సైనిక అధికారులు, రెండు కంపెనీలను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చింది. 2021 ఫిబ్రవరిలో మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని కూల్చివేసి.. సైనిక పాలనకు ఆర్మీ తెరలేపిన సంగతి విదితమే. దీనికి వ్యతిరేకించిన వారిపై కాల్పులు జరపడంతో అనేక మంది మృతి చెందారు.