ఉక్రెయిన్‌లో గత నెల రోజుల నుండి రష్యా దాడులకు దిగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఇప్పటికే పలు నగరాలు ధ్వంసమయ్యాయి. వందలాది మంది నిరాశ్రయులవ్వగా.. లక్షలాది మంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వలస వెళ్లిపోయారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి.
తాజాగా మరియుపోల్‌లోని ఓ ధియేటర్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించిందని, ఈ ఘటనలో 300 మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్ ఓడరేవు నగరమైన మరియుపోల్‌లో వందలాది మంది ఆశ్రయం పొందుతున్న డ్రామా థియేటర్‌పై గత వారంలో రష్యా బాంబు దాడులు జరిపినట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.
కీవ్, ఖర్కివ్, మరియుపోల్ వంటి నగరాల్లో క్షిపణులు, బాంబులతో రష్యా ఇంకా విరుచుకుపడుతుందని వార్తలు వినబడుతున్నాయి. కీవ్ సమీపంలో ఉక్రెయిన్ దళాలకు ఇంధనం సరఫరా చేసే ఓ భారీ ఇంధనాగారాన్ని ధ్వంసం చేసినట్టు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్‌లోని ఓడరేవుల్లో చిక్కుబడ్డ 67 నౌకలు సురక్షితంగా వెళ్లిపోయేందుకు శుక్రవారం నుంచి అనుమతిస్తామని ప్రకటించింది.
నెలకు పైగా జరుగుతున్న యుద్ధం ఉక్రెయిన్‌ను సంక్షోభపుటంచుల్లోకి నెట్టేసింది. తిండికి, తాగునీటికి కూడా దిక్కు లేక దేశమంతటా జనం అల్లాడుతున్నారు. ఎటు చూసినా నిత్యావసరాల కొరత పీడిస్తోంది. శవాలను తీసుకెళ్లేవారు కూడా లేకపోవడంతో మారియుపోల్ తరహాలో సామూహిక ఖననాలు జరుగుతున్నాయి.
ఉక్రెయిన్‌లో నాటో నేతృత్వంలో పాశ్చాత్య ‘శాంతిపరిరక్షణ’ దళాలను మోహరించాలన్న ప్రతిపాదనలను రష్యా అనుకూలుడైన బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని హెచ్చరించారు.
గ్యాస్ సరఫరాకు ప్రధానంగా రష్యాపై ఆధారపడుతూ వస్తున్న యూరప్ ఇకపై దానికి చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు అమెరికా, యూరోపియన్ యూనియన్ మధ్య శుక్రవారం కీలక వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. యూరప్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈయూ ఉన్నతాధికారులతో కలిసి ఒప్పంద వివరాలను వెల్లడించారు.
దీని ప్రకారం యూరప్ దేశాల ఇంధన, ముఖ్యంగా గ్యాస్ అవసరాలను చాలావరకు అమెరికా, ఇతర దేశాలు తీరుస్తాయి. యూరప్‌కు అమెరికా, ఇతర దేశాలు వార్షిక గ్యాస్ ఎగుమతులను మరో 15 బిలియన్ క్యూబిక్ మీటర్ల మేరకు పెంచాలన్నది తాజా ఒప్పంద సారాంశం.
దీన్ని మున్ముందు మరింత పెంచుతారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలని అంగీకారం కుదిరింది. యూరప్ తన గ్యాస్ అవసరాల్లో దాదాపుగా 40 శాతం రష్యా నుంచే దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే.
బొగ్గు, గ్యాస్, చమురు కోసం రష్యాపై ఆధారపడటాన్ని వీలైనంతగా తగ్గించుకుంటామని జర్మనీ ప్రకటించింది. ఇందుకోసం కొత్త సప్లయర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు ఆ దేశ ఆర్థిక మంత్రి రాబర్ట్ హెబెక్ వెల్లడించారు. జర్మనీ గ్యాస్ అవసరాల్లో 45 శాతానికి పైగా రష్యానే తీరుస్తోంది.
తమతో స్నేహపూర్వకంగా మసులుకోని దేశాలు గ్యాస్ బిల్లులను రష్యా కరెన్సీ రూబుల్స్‌లోనే చెల్లించాల్సి ఉంటుందన్న పుతిన్ వ్యాఖ్యలపై యూరప్ దేశాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
మరోవంక, జీ 20 కూటమి నుండి తొలగించినా మాకు నష్టమేమీ లేదని రష్యా స్పష్టం చేసింది. జీ-20 కూటమి నుంచి రష్యాను బహిష్కరించేందుకు తాము అనుకూలంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇది వరకే పేర్కొన్న నేపథ్యంలో… రష్యా తిరుగులేని సమాధానమిచ్చింది. ప్రస్తుతం జీ 20 నుంచి తాము బయటకు వచ్చినా రష్యాకు జరిగే నష్టమేమీ లేదని చెప్పింది.
More Stories
పాకిస్థాన్ సహా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్
ఐఎస్ఐఎస్ చీఫ్ ను హతమార్చిన అమెరికా దళాలు
తమిళనాడులో రూ.1000 కోట్ల లిక్కర్ స్కామ్!