కరోనా మృతుల నకిలీ క్లైయిమ్‌లపై కేంద్రం దర్యాప్తు

కరోనాతో  మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు అందిస్తున్న నష్ట పరిహారం కోసం నకిలీ క్లైయిమ్‌లు రావడంపై కేంద్రం విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు గురువారం అనుమతినిచ్చింది. మహారాష్ట్ర, కేరళ, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌ల్లో నమోదైన మరణాలకు చూపుతున్న క్లైయిమ్‌లకు మధ్య వ్యత్యాసం ఉండటంతో ఈ రాష్ట్రాల్లోని 5 శాతం క్లైయిమ్‌లను కేంద్రం నిర్ధారించవచ్చని జస్టిస్‌ ఎం ఆర్‌ షా, బివి నాగరత్న ధర్మాసనం పేర్కొంది.
నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులైన వారికి 60 రోజలు వ్యవధి ఇవ్వగా, హక్కుదారులకు 90 రోజులుగా నిర్ణయించింది. కాగా, కరోనాతో మృతి చెందిన వారి కుటుంబీకులు దాఖలు చేసుకున్న క్లైయిమ్‌ తాలుకా నగదును అధికారుల నుండి పొందేందుకు నాలుగు వారాల గడువు కోరుతూ కేంద్రం గతంలో పిటిషన్‌ దాఖలు చేసింది.
ఇలా ఉండగా, కరోనాతో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు అందిస్తున్న పరిహారం రూ.50 వేల కోసం నకిలీ క్లైయిమ్‌లు నమోదు కావడంపై గతంలో సుప్రీంకోర్టు విచారణ వ్యక్తం చేసింది. ఎక్స్‌గ్రేషియా చెల్లింపును సులభతరం చేసేందుకు రాష్ట్ర లీగ్‌ సర్వీస్‌ అధారిటీ (ఎస్‌ఎల్‌ఎస్‌ఎ) సభ్య కార్యదర్శితో సమన్వయం చేసుకోవడానికి ప్రత్యేక నోడల్‌ అధికారిని నియమించాలని అన్ని రాష్ట్ర  ప్రభుత్వ, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.