సజీవ దహనంకు ముందు తీవ్రంగా కొట్టారు!

 పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆ ఎనిమిది మందిని సజీవంగా దహనం చేయడానికి ముందు తీవ్రంగా కొట్టారని ఫోరెన్సిక్‌ నివేదికలో వెల్లడైంది. మృతదేహాలకు రామ్‌పుర్హాత్‌ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. వీరి శరీరాలపై తీవ్రగాయాలున్నాయని, సజీవ దహనానికి ముందు అత్యంత తీవ్రంగా కొట్టినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. 

పశ్చిమ బెంగాల్‌లో బీర్భం జిల్లాలోని భక్తు గ్రామంలో సోమవారం అర్థరాత్రి ఎనిమిది మందిని గుర్తుతెలియని దుండగులు అత్యంత అమానవీయంగా సజీవదహనం చేసిన సంగతి తెలిసిందే. వారిని ఇళ్ళల్లో బంధించి మరీ ఇళ్ళకు నిప్పంటించారు. తఅణమూల్‌ కాంగ్రెస్‌ డిప్యూటీ ప్రధాన్‌ భాదు షేక్‌ హత్య జరిగిన అనంతరం చెలరేగిన ఈ హింసాకాండలో అనేక ఇళ్లు దగ్ధమయ్యాయి. 

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు  20 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన కోల్‌కతా హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ బాధితులను పరామర్శించనున్నారు.

కాగా, బీర్భూమ్ జిల్లాలో మంగళవారం జరిగిన హింసాకాండలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి మమత బెనర్జీ గురువారం ఓదార్చారు. ఈ దుర్ఘటనలో మరణించిన ఎనిమిది మందికి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. మృతుల్లో ఇద్దరు బాలలు కూడా ఉండటంతో వీరికి అదనంగా రూ.50,000 చొప్పున పరిహారం చెల్లిస్తామని పేర్కొన్నారు. 

దుండగులు దహనం చేసిన ఇళ్ళను పునర్నిర్మించుకోవడానికి రూ.2 లక్షలు చొప్పున ఇస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ హింసాకాండను నిలువరించలేక పోయిన సీనియర్ పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

చాలా పెద్ద కుట్ర జరుగుతోందని పేరొక్నటు  పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తారని ఆమె భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా చట్టవిరుద్ధ ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.