ఉమర్‌ ఖలీద్‌కు బెయిల్ నిరాకరణ

ఢిల్లీ అల్లర్ల కేసులో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యుఎపిఎ) కింద అరెస్టు చేసిన జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి నేత ఉమర్‌ ఖలీద్‌కు బెయిలిచ్చేందుకు ఢిల్లీలోని  కర్కర్‌డుమా కోర్టు నిరాకరించింది.  అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి అమితాబ్‌ రావత్‌ ఈ తీర్పును ఈ నెల 3న రిజర్వ్‌లో ఉంచారు. 
 
తరువాత ఈ నెల 14, 21, 23 తేదీల్లో వివిధ కారణాలతో వాయిదా వేశారు. గురువారం తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. తాను నేరస్తుడినని నిరూపించేందుకు ప్రాసిక్యూషన్‌ వద్ద సరైన ఆధారాలు లేవని వాదనల సమయంలో ఖలీద్‌ కోర్టుకు తెలిపారు.
 
 2020 ఫిబ్రవరిలో పౌరసత్వ సవరణ చట్టానికి (సిఎఎ) వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో ఆందోళనలు చేపట్టగా, ఈ అల్లర్లలో 53 మంది చనిపోయారు. సిఎఎకు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న షహీన్‌బాగ్‌ ప్రాంతంలో ఖలీద్‌ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్లే అల్లర్లు జరిగాయని, ఆయనే ప్రధాన కుట్రదారుడని సెప్టెంబర్‌ 14న పోలీసులు అరెస్టు చేశారు.
 
 ప్రస్తుతం ఖలీద్‌ తీహార్‌ జైలులో ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో 18 మందిని అరెస్టు చేయగా… ఇప్పటి వరకు ఆరుగురికే బెయిల్‌ లభించింది.