తెలంగాణ రైతులను బలిచేస్తున్నటీఆర్ఎస్

తెలంగాణ రైతులను టీఆర్ఎస్ బలి చేస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని, వారిని చూస్తే జాలేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

బాయిల్డ్ రైస్ విషయంలో ఆంధ్రాకు లేని ఇబ్బంది తెలంగాణకు మాత్రం ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రానిది మొదటినుంచి ఒకే మాట అంటూ ఇచ్చిన టార్గెట్ కూడా తెలంగాణ పూర్తి చేయలేదని విమర్శించారు. ఏ రైతు కూడా బాయిల్డ్ రైస్ తయారుచేయడు. బాయిల్డ్ రైస్ ఇవ్వం అని రాసిచ్చినప్పుడు ఇంగితం లేదా? అంటూ నిలదీశారు. 

కరోనా సమయంలో అన్ని రాష్ట్రాలు పెట్రోల్ రేట్లు తగ్గించాయి.  కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం తగ్గించలేదు. `మీ కుటుంబ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రజలను బలి చేయొద్దు’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన అనుమతులు ఇప్పటివరకు అతీగతీ లేదని దుయ్యబట్టారు. 

గతేడాది ధాన్యం సేకరణకు కేంద్రం రూ.26,640 కోట్లు ఖర్చుచేసిందని చెబుతూ చివరి గింజా వరకు కేంద్రమే కొనుగోలు చేస్తుందని కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు.  రైతులను కేసీఆర్‌ కావాలనే రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గెలుపుతో కేసీఆర్ దిగజారి ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు.  కేంద్రంపై దుష్ప్రచారం చేస్తూ కేసీఆర్ రాజకీయపబ్బం గడుపుతున్నారని ధ్వజమెత్తారు.

వడ్ల ఎగమతిలో ఇతర రాష్ట్రాలకు లేని సమస్య తెలంగాణకు మాత్రమే ఎందుకొస్తుంది? తప్పుడు ప్రచారం చేయడానికి టీఆర్ఎస్ నేతలకు నోరెలా వస్తుంది? రైతుల గురించి మీకు బాధ్యత లేదా? అసలు ఇంతవరకు ఎంత పంట సాగయిందో కూడా చెప్పలేదు అంటూ కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. 

దేశానికో చట్టం.. తెలంగాణకో చట్టం ఉండదు. కానీ కేసీఆర్ మాత్రం సిద్ధిపేటకో చట్టం.. దుబ్బాకకో చట్టం అమలుచేస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.  ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేసీఆర్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని కేంద్ర మంత్రి విస్మయం వ్యక్తం చేశారు.  మంత్రులకు టార్గెట్ ఇచ్చి మరీ కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. 

తండ్రి, కొడుకు, కూతురు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని అంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు తెలివైనవారు.. సమయం వచ్చినప్పుడు వారి చతురతను ప్రదర్శిస్తారని  కిషన్ రెడ్డి కేసీఆర్ ను హెచ్చరించారు. 

హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్ళవచ్చు 

కాగాఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందిస్తూ న్యాయస్థానాన్ని అందరూ గౌరవించాలని హితవు చెప్పారు. ఒకవేళ హైకోర్టు ఇచ్చే తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చునని, ఆ అవకాశం కూడా ఉందని గుర్తు చేశారు. వ్యవస్థలను ఎప్పుడూ దెబ్బతీయకూడదని ఆయన సూచించారు. శాసనసభ, న్యాయవ్యవస్థ, పత్రికా, మీడియా రంగం చాలా కీలకమైన వ్యవస్థలను వాటిని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.