ధ‌ర్మ‌పురి అర‌వింద్ పై ‘నాన్ బెయిల‌బుల్ వారెంట్’

నాంప‌ల్లి కోర్టు బిజెపి నాయ‌కుడు, ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ పై  నాన్ బెయిలబుల్ వారెంట్ ని జారీ చేసింది. గతంలో అంటే 2020 నవంబర్ 23 వ తేదీన కెబిఆర్ పార్కు వద్ద టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కోడింగ్ లను ఎంపీ అరవింద్, ఆయన అనుచరులు చింపి వేశారు అంటూ కేసు నమోదు అయింది.
 
 అంతేకాదు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ లను దుర్భాషలాడారని అప్పట్లో టిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ హోదాలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీ తాత మధుసూదన్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో చార్జిషీట్ కూడా వేశారు. 
 
ఈ కేసును నేడు నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు విచారణ చేసింది. అయితే ఇవాళ తప్పనిసరిగా కేసు విచారణకు హాజరు కావాల్సినప్పటికీ..ధర్మపురి అరవింద్ హాజరు కాలేక పోయారు. దీంతో ఆగ్రహం గురైన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ధర్మపురి అరవింద్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

తెలంగాణను బెంగాల్‎గా మార్చొద్దు

తెలంగాణను మరో బెంగాల్‎గా మార్చొద్దని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ ఎన్  రాంచందర్ రావు కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు బీజేపీ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు పోలీసులను చెప్పుచేతల్లో ఉంచుకొని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని రాంచందర్ రావు మండిపడ్డారు. 
 
దాడులు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ అదనపు డీజీపీ జితేందర్‎కు ఆయన లేఖ అందజేశారు. ‘బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారు. బీజేపీ నేతలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. సిరిసిల్లలో టీఆర్ఎస్ నేతలు బీజేపీ లీడర్లపై దాడులు చేశారు. దాడులు చేసిన వారిని వదిలేసి.. అక్రమంగా బీజేపీ నేతలపై కేసులు నమోదు చేస్తున్నారు’ అంటూ ఆయన ఆరోపించారు.
బోధన్‎లో శివాజీ విగ్రహం పెట్టె ప్రయత్నం చేస్తే బీజేపీ నేతలపై 307 సెక్షన్ క్రింద హత్యానేరం మోపారని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.  తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై దాడి చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. బీజేపీ కార్యాలయంపై టీఆర్ఎస్ నాయకులు దాడులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు.
మహిళా న్యాయవాదిపై ఏకంగా కోర్టులోనే దాడికి దిగారని, అయినా అందుకు బాధ్యులైన వారిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదని ఆయన తెలిపారు.  బీజేపీ నేతలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని చెబుతూ కేంద్ర హోంశాఖ సహాయంతో  ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.  బీజేపీ నేతలపై దాడులు చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని రామచంద్ర రావు డిమాండ్ చేశారు. ఈ దాడులను ఆపకుంటే భవిష్యత్‎లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని స్పష్టం చేశారు.