ఇమ్రాన్‌ ఖాన్‌కు రూ 50 వేలు జరిమానా, ఎదురు తిరిగిన మిత్రపక్షాలు

ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం జాతీయ అసెంబ్లీలో చర్చకు వస్తుండగా, మరో నాలుగు రోజులలో ఓటింగ్ జరుగబోతుండగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అన్ని ప్రతికూలతలే ఎదురవుతున్నాయి.  ఇటీవల స్వాత్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని  ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందుకు గాను పాకిస్థాన్ ఎన్నికల సంఘం ఆయనకు రూ. 50 వేల జరిమానా విధించింది. 
 
కైబర్‌- పఖ్తున్క్వాలో స్థానిక ప్రభుత్వ ఎన్నికలు జరుగుతున్న వేళ ఇమ్రాన్‌ ఈ నెల 15న స్వాత్‌ను సందర్శించొద్దని, అక్కడ బహిరంగ సభల్లో పాల్గొనవద్దంటూ  ఇసిపి జాటీచేసిన ఆదేశాలను లెక్కచేయకుండా ఇమ్రాన్‌ ఖాన్‌.. స్వాత్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొని, ప్రసంగించారు.
 
ఎన్నికల సంఘం కొత్త నియమావళి ప్రకారం ఎన్నికలు జరిగే జిల్లాల్లో ప్రభుత్వ ప్రతినిధులు పర్యటించరాదు. ఈ నెల 31న కైబర్‌-పఖ్తున్క్వాలో రెండో దశ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. దీంతో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడిన ప్రధానికి రెండుసార్లు ఇసిపి నోటీసులు జారీచేసింది. 
 
ఈ నోటీసులను వ్యతిరేకిస్తూ పాకిస్తాన్‌ ప్రధాని, ప్రణాళికా శాఖా మంత్రి అసద్‌ ఒమర్‌ ఇస్లామాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రవర్తనా నియమావళిని అమలుచేసే అధికారం ఇసిపికి ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
 
మిత్రపక్షాల మద్దతు ఉపసంహరణ 
 
మరోవంక, అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనే ముందుర ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని  తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ (పీటీఐ పార్టీ) అధికార కూటమిలో భాగస్వాములైన మూడు మిత్రపక్ష పార్టీలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించు కొంటున్నట్టు ప్రకటించాయి. 
 
పీటీఐ ప్రధాన భాగస్వామ పార్టీలు ఎంక్యూఎం-పీ, పీఎంఎల్‌-క్యూ, బీఏపీ లు అధికార కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాయి. అంతేకాదు ప్రతిపక్షంలో చేరి ఇమ్రాన్‌ ఖాన్‌కు వ్యతిరేకంగా పోరాడాలని  నిర్ణయించుకున్నాయి. నాలుగేళ్ల ఖాన్‌ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత నేపథ్యంలో మిత్రపక్షాలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
 
మొత్తం 342 సభ్యులున్న పాక్‌ జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కడానికి ఇమ్రాన్ ఖాన్ కు 172 ఓట్లు రావాల్సి ఉంటుంది. దిగువ సభలో ప్రభుత్వానికి 155 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు నాలుగు మిత్రపక్షాలతో కలిసి (155+ మిత్రపక్షాలు 20 సీట్లు) 175 సీట్లను ప్రభుత్వం కలిగి ఉంది. ఇప్పుడు మిత్రపక్షాల దూరంతో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వ పతనం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
 
కాగా, అధికార పక్షానికి చెందిన 24 మంది మంత్రులు, ఎంపీలు ఇప్పటికే అవిశ్వాస తీర్మానంకు మద్దతు తెలుపుతూ ఓట్ వేయనున్నట్లు ప్రకటించారు.