మారియుపోల్ శిథిలాలలో లక్ష  మంది చిక్కుకున్నారు

ఉక్రెయిన్ దేశంపై రష్యా బాంబులతో విరుచుకుపడుతోంది. రష్యా దాడితో ఉక్రెయిన్‌లో భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సిటీ మారియుపోల్‌లో 100,000 మందికి పైగా చిక్కుకున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. 
 
గత 24 గంటల్లో 7,000 మందికి పైగా తప్పించుకున్నప్పటికీ, మారియుపోల్ శిథిలాలలో దాదాపు 100,000 మంది ఇప్పటికీ చిక్కుకున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మంగళవారం తెలిపారు.  కైవ్ సమీపంలోని ఒక పట్టణాన్ని తమ దళాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయని, దేశంలోని దక్షిణాన రష్యన్ దళాలపై దాడి చేస్తున్నాయని తెలిపారు. 

ఇలా ఉండగా,  మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత తాము లక్షంగా ఎంచుకున్న మరియూపోల్ నగరంపై రష్యా దళాలు రెండు సూపర్ బాంబులను ప్రయోగించాయి. ఓ వైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై దాడులతో కైవసానికి యత్నిస్తూనే రష్యా సేనలు మరియూపోల్‌పై విరుచుకుపడ్డాయి. దీనితో ముందు జాగ్రత్త చర్యగా కీవ్‌లో ప్రజలు బయటకు రాకుండా కర్ఫూ విధించారు. భద్రత కట్టుదిట్టం చేశారు.

తమకు అత్యంత తీవ్రస్థాయి భద్రతా ముప్పు వాటిల్లితే , తప్పనిసరి పరిస్థితుల్లోనే అణ్వాయుధాలను వాడుతామని రష్యా ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఇదే దశలో మరియూపోల్‌పై శక్తివంతమైన రెండు సూపర్ బాంబులను విసిరింది. ఇప్పటికే ఈ నగరం రష్యా సేనల దిగ్బంధంలో చిక్కింది. పౌరులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. ఈ దశలోనే తీవ్రస్థాయి బాంబులను ప్రయోగించడం మరింత భయానక స్థితిని కల్పించింది

అయితే, రష్యా పురోగతి ఇప్పటికే చాలా ప్రాంతాలలో నిలిచిపోయిందని రాయిటర్స్ పేర్కొంది. రష్యా ఇప్పటికే 40 శాతం దాడి చేసే దళాలను కోల్పోయిందని, రష్యా అణుయుద్ధం చేసే అవకాశాన్ని కూడా తగ్గించిందని  ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు ఒలెక్సీ అరెస్టోవిచ్ తెలిపారు.
 
ఇలా ఉండగా, ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధం కొనసాగిస్తున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ హెచ్చరికలు జారీ చేశారు. ఉక్రెయిన్‌లో జీవ, రసాయన ఆయుధాలను ఉపయోగించవద్దని జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను హెచ్చరించారని ప్రభుత్వ ప్రతినిధి బుధవారం తెలిపారు.
మరోవంక, గూఢచర్యానికి పాల్పడుతున్నారనే అనుమానంతో తమ దేశంలోని 45 మంది రష్యా దౌత్యవేత్తలను పోలాండ్ బహిష్కరించింది. దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. డిప్లమేటిక్ హోదాను ఉపయోగించుకుని పోలెండ్‌లో ఉంటూ రష్యాకు అనుకూలంగా వీరు గూఢచర్యం సాగిస్తున్నట్టు పోలాండ్ అంతర్గత భద్రతా ఏజెన్సీ గుర్తించింది.
శాంతి దళాలను పంపితే నాటోతో రష్యా యుద్ధం 
 
 కాగా, ఉక్రెయిన్‌కు శాంతి పరిరక్షక దళాలను పంపాలని పోలండ్‌ చేసిన ప్రతిపాదనను నాటో అంగీకరిస్తే, నాటోతో రష్యాకు యుద్ధం మొదలైనట్టేనని రష్యా హెచ్చరించింది. ”నాటో సమావేశమవు తోందని, శాంతి పరిరక్షక బలగాలను మోహరిస్తామని పోలండ్‌ డిప్యూటీ ప్రధాని జరోస్లా కజియెన్స్కీ ఇప్పటికే చెప్పారు. ఇక రష్యా, నాటో సాయుధ బలగాల మధ్య ప్రత్యక్ష ఘర్షణ మొదలవుతుంది. ఇటువంటి యుద్దం జరగకూడదని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు.” అని రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్‌రోవ్‌ స్పష్టం చేశారు. 
 
ఉక్రెయిన్‌లోని అతిపెద్ద పశ్చిమ ప్రాంత నగరమైన లివివ్‌లో తమ ప్రధాన కార్యాలయాన్ని పెట్టాలని, యుద్ధం ముగిసేవరకు అక్కడే వుండాలని పోలండ్‌ భావిస్తోందని అయన ఆరోపించారు. ఇవి కేవలం ఆలోచనలు కాదని, గతంలోనూ జరిగాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా దళాలపై పోరాడేందుకు చిన్నపాటి బెటాలియన్లను పంపినా సరే సహించేది లేదని బాల్టిక్‌ దేశాలను కూడా ఆయన హెచ్చరించారు.