టిడితో పొత్తుకు ఏపీ బిజెపి ససేమీరా!

వచ్చే ఎన్నికలలో వైసిపి వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో ప్రకటించడం ద్వారా తిరిగి టిడిపి, బీజేపీల పొత్తుకు ప్రయత్నం చేస్తున్నట్లు సంకేతం ఇచ్చారు. ఈ ప్రకటనపై రాష్ట్ర బిజెపి వర్గాలలో తీవ్రమైన విముఖత వ్యక్తం అవుతున్నది. 
 
సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోకూడదని రాస్జ్త్ర బిజెపి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు కర్నూలులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో 13 జిల్లాల బిజెపి అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లు ఆ మేరకు  అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. 
 
బిజెపి దక్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జ్‌ శివ ప్రకాశ్‌, రాష్ట్ర సహా ఇన్‌చార్జ్‌ సునీల్‌ దియోధర్‌, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజులతో పాటు 13 జిల్లాల అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లతో పాటు పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బిజెపితో పొత్తులేకుండా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవని, తమ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తిరిగి బిజెపికే వెన్నుపోటు పొడుస్తున్నారని ఈ సందర్భంగా పలువురు విమర్శలు గుప్పించారు. 
 
దీంతో టిడిపితో పొత్తు ఉండబోదని పలువురు నాయకులూ స్పష్టం చేస్తున్నారు.  చంద్రబాబునాయుడు బిజెపి పొత్తుతో ఎన్నికల బరిలో నిలిచినప్పుడు మాత్రమే అధికారంలోకి వచ్చారని, బిజెపితో కలవకుండా అతను అధికారంలోకి వచ్చిన సందర్భమే లేదని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉం వైఎస్‌ఆర్‌ పార్టీ బలంగా ఉందని, ఆ పార్టీని ఒంటరిగా ఎదుర్కొనే సాహసం చంద్రబాబు చేయరని, తిరిగి బిజెపితో జతకట్టేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తారని భావిస్తున్నారు.
అయితే  చంద్రబాబును ఆపార్టీ నేతలే నమ్మే పరిస్థితిలో లేరని, కేవలం పొత్తులపై ‘మైండ్‌గేమ్‌’ ఆడుతున్నారని పేర్కొంటున్నారు. జాతీయపార్టీగా ఉన్న బిజెపి రాష్ట్రంలో కనీసం ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే స్థానాన్ని కూడా గెలవలేదంటే పార్టీ సంస్థాగతంగా బలంగా లేకపోవడమే కారణమని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.
ముందుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకొనే విధంగా కృషి చేయాలని ఓ నిర్ణయానికి వచ్చారు.  గత ఎన్నికలలో నోటా కన్నా తక్కువ ఓట్లతో అభాసుపాలైన పార్టీని ప్రజల ముందు ప్రత్యామ్న్యాయ రాజకీయ శక్తిగా నిలబెట్టాలంటే ఎంతో కష్టపడి వలసిందే అని భావిస్తున్నారు. ఈ దిశలో కార్యాచరణ రూపొందించుకొని ప్రయత్నాలు చేస్తున్నారు.
 
ఏది ఏమైనా పొత్తుల అంశం కేంద్ర పార్టీ పరిధిలోనిది కావడంతో, ఆ విషయాన్నీ పక్కన పెట్టి వచ్చే ఎన్నికలలో నియోజకవర్గాల వారీ బలమైన అభ్యర్థులను గుర్తించడం, పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేసుకోవడం పట్ల దృష్టి సారించాలని భావిస్తున్నారు. 
 
అయితే ఈ విషయమై ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ బిజెపి నాయకత్వంతో చర్చించినట్లు తెలియడం లేదు. ఆయన నేరుగా కేంద్ర నాయకత్వంతో సంప్రదించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తున్నది. రెండు పార్టీల మధ్య రెండేళ్లకు పైగా పొత్తు కొనసాగుతున్నా రాజకీయంగా రెండు పార్టీల నాయకులు కలసి ఇప్పటి వరకు సమిష్టిగా వ్యూహం, కార్యక్రమాలు రూపొందించుకొని ప్రయత్నం చేయడం లేదు. ఎవ్వరి దారి వారధిగా ఉంటున్నది.