భారత్ కు అనుకూలం కానున్న చైనా ఆర్ధిక మందగమనం 

చైనా ఆర్థిక మందగమనం భారత్ కి అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇది భారత్ లో  కొత్త అవకాశాలు సృష్టించేందుకు ఎంతగానో ఉపయోగడనుంది. డ్రాగన్ దేశంలో  వృద్ధిరేటు పడిపోవడానికి అక్కడి భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చివేశాయని హాకాంగ్ పోస్ట్ నివేదించింది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ ప్రత్యేకించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో మెరుగుపడిందని పేర్కొంది. 

ఆర్థిక సంస్కరణలు అనుసరించి.. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్  ఆవిర్భవించడం ఖాయంగా కనిపిస్తోందని తెలిపింది. భారత్ గత దశాబ్ద కాలంలో ఆర్థిక సంస్కరణలను అనుసరించి వేగంగా అభివృద్ధి చెందుతోందని వెల్లడించింది. మౌలిక సదుపాయాలు, రవాణా, విద్య, అక్షరాస్యత, ప్రజారోగ్యం, ఈ కామర్స్, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, ఉద్యోగ అవకాశాల్లో చాలా ముందుందని తెలిపింది. 

ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడం, ద్రవ్యోల్బణం పెరుగుదలతో చైనా ఆర్థిక మందగమనం దిశగా పయనిస్తుందని పేర్కొంది. 2022కు చైనా జిడిపి  అంచనాలు 5 నుంచి 5.5 శాతం మధ్య ఉండవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది చైనీస్ యువతకు ఉపాధి కల్పించడానికి అవసరమైన రేటు కంటే చాలా తక్కువ.  చైనా తయారు చేసే వస్తువులపై విశ్వాసం కోల్పోవడంతో  కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయని నివేదికలో తెలిపింది. 

అలాగే శ్రీలంక, పాకిస్థాన్ దేశాలు కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆ దేశాలకు చైనా నుంచి సప్లై చైన్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ప్రధానంగా కరోనా  ఒమిక్రాన్ వేరియంట్ విజృంభించడంతో చైనాలోని ఆటో మొబైల్ ఉత్పత్తిలో 11 శాతం వాటా కలిగిన షెన్ జెన్, చాంగ్ చున్ లతో సహా చాలా పరిశ్రమలు  మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది.

చైనాకు ప్రత్యామ్నాయాన్ని కోరుకునే కంపెనీలు భారత్  వైపు చూస్తున్నాయని తెలిపింది. ఫలితంగా గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా భారత్ మారే అవకాశం ఉందని తెలిపింది. అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీలు భారత్ లో   పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపింది. మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్ అప్ ఇండియా కింద భారత్ అందించే ప్రోత్సాహకాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు అవకాశాలు అందిస్తున్నాయని తెలిపింది.