వ్యవసాయ చట్టాల రద్దుకు `సుప్రీం’ ప్యానల్ అభ్యంతరం 

కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో పార్లమెంట్‌లో రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ వీటి రద్దుపై అభ్యంతరం తెలిపింది. ఈ మూడు వ్యవసాయ చట్టాలు రైతులకు ఎంతో ప్రయోజనకరమని, వీటిని రద్దు చేయడం కన్నా కొనసాగించడమే మంచిదని ఆ కమిటీ సిఫార్సు చేసింది. 

కేంద్రం ఆ చట్టాలను పూర్తిగా తొలగించడం సరికాదని అభిప్రాయపడింది. ఈ చట్టాలను తొలగించడం లేదా ఎక్కువకాలం పాటు అమలు చేయకుండా ఉండడం.. వీటిని సమర్థించే మెజారిటీ ప్రజల పట్ల అన్యాయమేనని పేర్కొంది. సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేసే బదులు నిర్ణీత ధరలకు రైతుల పంటలను సేకరించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని, అలాగే నిత్యావసర సరుకుల చట్టాన్ని తొలగించాలని ఆ కమిటీ సూచించింది.

గత ఏడాది మార్చి 19న సుప్రీంకోర్టుకు సమర్పించిన కమిటీ నివేదిక సోమవారం బహిర్గతమైంది. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిటీ వ్యవసాయ చట్టాలలో అనేక మార్పులను కూడా సూచించింది. పంటలకు కనీస మద్దతు ధరను(ఎంఎస్‌పి) చట్టబద్ధం చేసే స్వేచ్ఛను రాష్ట్రాలకే వదిలిపెట్టాలని కూడా కమిటీ సూచించింది. కమిటీ సభ్యులలో ఒకరైన అనీల్ ఘన్వట్ సోమవారం ఇక్కడ తమ కమిటీ నివేదికలోని సిఫార్సులను విలేకరులకు తెలియచేశారు.

2021 మార్చి 19న కమిటీ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించామని, నివేదికను విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు మూడు సార్లు లేఖలు రాసినా ఎటువంటి స్పందన లేదని స్వతంత్ర భారత్ పార్టీ అధ్యక్షుడైన ఘన్వట్ తెలిపారు. మూడు వ్యవసాయ చట్టాలు రద్దు అయినందున ఇప్పుడు అవి చెల్లుబాటులో లేవని, అందుకే తాను నివేదికను బయటపెడుతున్నానని ఆయన చెప్పారు. 

భవిష్యత్తులో వ్యవసాయ రంగం కోసం విధానాలను రూపొందించడంలో కమిటీ నివేదిక ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం లేదా వాటిని దీర్ఘకాలం సస్పెన్షన్‌లో ఉంచడం వల్ల వాటిని బలపరుస్తున్న వారికి అన్యాయం చేసినట్లేనని ఘన్వట్ అభిప్రాయపడ్డారు. 

తాము అభిప్రాయాలు సేకరించిన వ్యవసాయ సంఘాలలో 3 కోట్ల మంది రైతులకు  ప్రాతినిధ్యం వహించే 86 శాతం మంది ఈ చట్టాలకు మద్దతు తెలిపారని ఆయన వెల్లడించారు. ఈ కమిటీలో వ్యవసాయ ఆర్థిక నిపుణులు అశోక్ గులాటీ, ప్రమోద్ కుమార్ జోషి ఇతర సభ్యులు.

ఆయన చెప్పిన ప్రకారం ఆన్‌లైన్‌లో, ఈ-మెయిళ్ల ద్వారా స్పందించిన వారిలోనూ మూడింట రెండొంతుల మంది చట్టాలకు అనుకూలమేనని తేలింది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసనలకు దిగిన సంయుక్త కిసాన్‌ మోర్చా వంటి 40 సంఘాలను ఎన్నిసార్లు కోరినా స్పందనలు తెలియజేయలేదు.

కేరళ రాష్ట్ర ప్రభుత్వం పండ్లు, కూరగాయలకు కనీస మద్దతు ధర ఇస్తున్నట్టుగా.. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే స్వేచ్ఛను రాష్ట్రాలకు కల్పించాలి.

బియ్యం, గోధుమల సేకరణకు ప్రస్తుత ‘ఓపెన్‌ ఎండెడ్‌’ విధానాన్ని తొలగించి మోడల్‌ కాంట్రాక్ట్‌ అగ్రిమెంట్‌ విధానాన్ని రూపొందించాలి. ఓపెన్‌ ఎండెడ్‌ వి ధానం అంటే అన్ని రాష్ట్రాల్లో నిర్ణీత కాలవ్యవధిలో, ప్రభు త్వం నిర్ణయించిన స్పెసిఫికేషన్ల మేరకు ఉండే ధాన్యాన్ని రైతులు ఎంత తెచ్చినా ప్రభుత్వమే కనీస మద్దతు ధర కు కొనుగోలు చేయడం. మోడల్‌ కాంట్రాక్ట్‌ అగ్రిమెంట్‌ అంటే రైతులు ఒక సీజన్‌లో విక్రయించే ధాన్యంపై ముందే ఒప్పందం కుదుర్చుకోవడం.

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న డి మాండ్‌ అమలు అసాధ్యం. ‘‘ఏ ఉత్పత్తిని అయినా ఆచరణీయ ధరలకు విక్రయించాలి. కనీస మద్దతు ధర అంటే రైతులు పూర్తిగా నష్టపోకుండా వారిని కాపాడేందుకు సూచించే కనిష్ఠ ధర. కనీస మద్దతు ధర జాబితాలోని 23 ఉత్పత్తులనూ రైతులు ఎంత తెస్తే అంత పరిమాణంలో ప్రభుత్వం కొనలేదు’’

కనీస మద్దతు ధరకు సేకరించే విధానాన్ని ఎప్పుడో హరిత విప్లవం సమయంలో రూపొందించారని, ఇప్పు డు గోధుమ, బియ్యం కావాల్సిన దానికన్నా అధికంగా పండుతున్నందున ఆ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది. ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా గోధుమ, బియ్యం సేకరణకు ఒక పరిమితి ఉండాలి. ఎం దుకంటే కొన్ని రాష్ట్రాల్లో ఈ విధానం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల మిశ్రమంలో తేడాలు వచ్చి, పర్యావరణానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.