ఉక్రెయిన్ మారణకాండకు రష్యాదే బాధ్యత

ఉక్రెయిన్‌లో ఇప్పటి భారీ స్థాయి ప్రాణ నష్టానికి రష్యానే జవాబుదారీ వహించాల్సి ఉంటుందని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ సోమవారం స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో స్కాట్ వర్చువల్ సమావేశంలో మాట్లాడుతూ భారత్ ఆస్ట్రేలియా మధ్య మైత్రీ బంధం వంటి కీలక అంశాల నేపథ్యంలో ఉక్రెయిన్ అంశంపై ఆస్ట్రేలియా ప్రధాని ప్రధానంగా ప్రస్తావించారు. 

ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇటువంటి భయానక పరిస్థితి ఇకపై తలెత్తకుండా అన్ని చర్యలూ తీసుకోవల్సి ఉందని ఆస్ట్రేలియా నేత తెలిపారు. రష్యా ఇప్పుడు ఉక్రెయిన్‌పై సాగిస్తోన్న దాడిలో వేలాది మంది పౌరులు మృతి చెందుతున్నారుని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  అత్యధిక సంఖ్యలో నిర్వాసితులు అయ్యారని గుర్తు చేశారు. 

ఇటువంటి పరిస్థితి ఎక్కడా తలెత్తకూడదని ఆకాంక్షించారు. ఉక్రెయిన్ సంక్షోభంపై ఇటీవలి క్వాడ్ దేశాల భేటీలో చర్చ జరిగిందని మోరిసన్ గుర్తు చేశారు. ఇండో పసిఫిక్ ప్రాంతపు పరిణామం నేపథ్యంలో యూరప్‌లో తలెత్తిన పరిస్థితులను ఈ క్వాడ్ భేటీలో చర్చించేందుకు వీలేర్పడినట్లు తెలిపారు.

ప్రధాని మోదీ  తమ ప్రసంగంలో ప్రత్యేకించి భారత్ ఆస్ట్రేలియా మధ్య సంబంధాల గురించి ప్రస్తావించారు. సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం అమలులోకి రావడం వల్ల ఉభయదేశాల మధ్య సరైన ఆర్థిక భద్రతకు వీలేర్పడిందని తెలిపారు. క్వాడ్‌లోనూ ఇరుదేశాల మధ్య సవ్యమైన రీతిలో సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. 

కీలక రంగాలతో పాటు అత్యంత ప్రాధాన్యత గల ఖనిజాలు, నీటి నిర్వహణ, పునరుత్థాన ఇంధనం, కొవిడ్ పరిశోధనల వంటి వాటిపై కూడా సమీక్ష సాగుతోందని వివరించారు. ఉక్రెయిన్ గురించి ప్రధాన మంత్రి మోదీ  ప్రస్తావించలేదని వెల్లడైంది. భారతదేశపు విదేశాంగ విధానాన్ని ఆస్ట్రేలియా ప్రధాని ప్రస్తావిస్తూ కీలక అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ  అనేక సార్లు చొరవ తీసుకుని సవ్యంగా వ్యవహరించిందని కొనియాడారు. 

ఉక్రెయిన్ పై భారత్ వైఖరిని అర్ధం చేసుకున్న స్కాట్ 
సమ్మిట్‌ ముగింపులో మీడియాతో విదేశాంగ కార్యదర్శి హర్ష్‌ ష్రింగ్లా మాట్లాడుతూ, సంక్షోభంపై భారతదేశ వైఖరిపై ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ తన అవగాహనను వ్యక్తం చేశారు. ఇండో-పసిఫిక్‌ నుండి దష్టి మరల్చడానికి ఈ వివాదం కారణం కాకూడదని ఇద్దరు నేతలు భావించారని తెలిపారు. 
 
ఉక్రెయిన్‌, రష్యా ఘర్షణపై భారతదేశ వైఖరిని అర్థం చేసుకున్నానని మోరిసన్‌ పేర్కొన్నారు. ఇద్దరు నాయకుల మధ్య చర్చల సందర్భంగా, కొనసాగుతున్న సంఘర్షణ, మానవతా పరిస్థితుల గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో శత్రుత్వాలు హింసను ఆపాల్సిన ఆవశ్యకత గురించి ఇరువురు నాయకులు పేర్కొన్నారు.

ఇండో-ఫసిఫిక్‌ ప్రాంతానికి భావ సారూప్యత కలిగిన ఉదారవాద ప్రజాస్వామ్య దేశాల మధ్య సహకారం కీలకమని మారిసన్‌ వ్యాఖ్యానించారు. ఇటువంటి కీలకమైన అంశాలపై దృష్టి పెట్టడానికి క్వాడ్‌లో భారత్‌ నాయకత్వాన్ని మారిసన్‌ స్వాగతించారు.