రానున్న కాలంలో కాషాయమే జాతీయ పతాకం కావచ్చు

కాంగ్రెస్‌ కుట్ర పూరిత విధానాల వలన భారత పతాకం మారిందని, రానున్న కాలంలో కాషాయ ధ్వజమే జాతీయ పతాకం కావచ్చునని కర్ణాటక ఆర్‌ఎస్ఎస్‌ ముఖ్య నాయకుడు డా. కల్లడ్క ప్రభాకర్‌ భట్‌ తెలిపారు. ఆదివారం విశ్వహిందూపరిషత్‌ మంగళూరులో చేపట్టిన కొరగజ్జన క్షేత్ర పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొంటూ  బ్రిటీషు పతాకం దేశమంతటా ఉండేదని, అంతకంటే ముందు ఆకుపచ్చ పతాకం ఉండేదని పేర్కొన్నారు.
మైనారిటీలను సంతృప్తి పరచడం కోసం జాతీయ పథకంను నిర్ణయించారని చెబుతూ, అయినా తాను జాతీయ పతాకంను గౌరవిస్తానని ఆయన స్పష్టం చేశారు. అదే విధంగా వందేమాతరంను కాదని జనగనమనను జాతీయ గీతంగా నిర్ణయించారని ప్రభాకర్ భట్ గుర్తు చేశారు.
 
రా జ్యసభ, లోక్‌సభలో స్పష్టమైన మెజారిటీ సాధ్యమైతే పతాకం మార్పు జరగవచ్చని ఆయన చెప్పారు. పతాకాన్ని మార్పు చేసేందుకు సాద్యం కాలేదని చెప్పలేమని తెలిపారు. ఇదే తరహాలో కొనసాగితే హిందూ సమాజం ఒక్కటి కానుందని స్పష్టం చేశారు. 
 
కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాలో చూపింది కొంతమాత్రమే అని తెలిపారు.“అందరినీ చంపాలని ఖురాన్, బైబిల్ బోధిస్తున్నాయి. ఈ విషయాలన్నీ ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో చిత్రీకరించారు” అని ఆయన  చెప్పారు. 
 
బైబిల్, ఖురాన్ అమాయకులను చంపడం, అత్యాచారం చేయడం నేర్పించాయా? ఆ పవిత్ర గ్రంథాలలో ఉంటే ఇప్పుడు వాటిని మార్చాలి’’ అని డాక్టర్ కల్లడ్క ప్రభాకర్ భట్ స్పష్టం చేశారు. 


“ప్రజలు మనుస్మృతి గురించి మాట్లాడుతున్నారు. అందులో ఎవరికైనా తప్పు అనిపిస్తే ఎత్తి చూపాలి. మనకు అలాంటి స్వేచ్ఛ ఉంది. పాత కాలంలో హిజాబ్ వైపు వెళ్లాల్సిన అవసరం లేదు. కితాబ్ వైపు వెళ్దాం. అందరూ ఐక్యంగా చదువుకోవాలి” అని హితవు చెప్పారు. 

ప్రస్తుతం కొనసాగుతున్న హిజాబ్ వివాదం ఒక రకమైన జిహాద్ అని ఆయన ఆరోపించారు. కితాబ్ కంటే హిజాబ్‌ను ఎంచుకోవడానికి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. సానియా మీర్జా,  రచయిత్రి సారా అబూబకర్ వంటి మహిళలు వ్యతిరేకించినప్పుడు కొంతమంది ముస్లిం అమ్మాయిలు తరగతి గదులలో హిజాబ్ ధరించాలని పట్టుబట్టడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. 
 
హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు నిర్ణయానికి నిరసనగా ఇటీవల ముస్లిం వ్యాపారులు దుకాణాలను మూసివేయడం మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్య అని, ధ్వజమెత్తుతూ అలాంటి చర్య దేశద్రోహానికి సమానం అని స్పష్టం చేశారు. 
 
6 నుండి 10  తరగతులలో భగవద్గీతను బోధించాలనే గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని భట్ ప్రశంసించారు. కర్ణాటకలోని పాఠశాలల్లో కూడా దీనిని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడాలని  ఆయన సూచించారు. భగవద్గీతను పాఠశాలల్లో బోధించాలని, ఖురాన్ ,  బైబిల్ ఇళ్లలో బోధించాలని ఆయన హితవు చెప్పారు. 

సాంప్రదాయ హిజాబ్‌ ను తిరిగి అమలు చేయాలనడానికి ఎటువంటి సహేతుకమైన కారణం లేదని ఆయన స్పష్టం చేశారు. 

 గత ప్రభుత్వాలు లౌకికవాదం పేరుతో అన్యాయం చేశాయని చెబుతూ  బ్రిటీషువారు భారత్‌కు వచ్చాక ఇక్కడి వైవిద్యతను నాశనం చేసేందుకు మతం అనే పదాన్ని అమలు చేశారని విమర్శించారు. 
 
భగవద్గీత చదివిన వారెవరూ ఇతరులకు చెడుచేయరని ప్రభాకర్ భట్ స్పష్టం చేశారు. దేశంలో పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ  పిల్లలకు రామాయ ణ, మహాభారత గ్రంథాల గురించి నేర్పాలని ఆయన సూచించారు. తద్వారా సమాజానికే మంచిదని తెలిపారు.
 
ప్రతిపక్షనేత సిద్దరామయ్య ఒకసారి గోద్రాకు వెళ్లి రైలుకు నిప్పుపెట్టిన వారి ఇళ్లకు వెళ్లి రావాలని ఆయన డిమాండ్‌ చేశారు. హిజాబ్‌ వివాదంపై మా ట్లాడుతూ విద్యార్థులు హిజాబ్‌తో తరగతులకు రావడం ఎవరికీ క నిపించదని, కానీ కాషాయం శాలువాతో వస్తే అదో పెద్ద వివాదమవుతుందా? అని ప్రశ్నించారు.