ఇమ్రాన్ ఖాన్ కు సైన్యం మొండిచెయ్యి!

అవిశ్వాస తీర్మానం గండం నుండి బైట పడేందుకు ఆసరాగా నిలబడుతుందని ఆశించిన సైన్యం పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మొండిచేయి చూపుతున్నది. భుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటల్‌ ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానానికి సిద్ధమౌతున్న సమయాన..24 మంది ఎంపిలు తిరుగుబావుటా ఎగురవేయడం తో ఆయన ప్రభుత్వానికి అంతిమ ఘడియలు సమీపించినట్లు స్పష్టం అవుతున్నది.

రాజకీయ సంక్షోభం గురించి స్పందించిన ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వా  తమది తటస్టవైఖరి అని తేల్చిచెప్పడంతో ఇమ్రాన్‌ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లవుతుంది. గతంలో పాక్‌ గూఢచార సంస్థ ‘ది ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌’ (ఐఎస్‌ఐ) చీఫ్‌ నియామకం విషయంలో ఇమ్రాన్‌, బజ్వాకు విభేదాలు తలెత్తాయి.

ఐఎస్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌గా తనకు సన్నిహితుడైన లెఫ్టినెంట్‌ జనరల్‌ ఫయీజ్‌ హమీద్‌ను కొనసాగించాలని ఇమ్రాన్‌ భావించారు. చివరకు జనరల్‌ బజ్వా ఒత్తిడికి తలగ్గి హమీద్‌ను తొలగించారు. మరో లెఫ్టినెంట్‌ జనరల్‌ నదీం అంజుమ్‌ ఐఎస్‌ఐ చీఫ్‌ అయ్యారు.

దీంతో అప్పటి నుండి అంతర్గతంగా ప్రధానికి, ఆర్మీ చీఫ్‌కు పొరపాచ్చాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు రాజకీయ అనిశ్చితి నెలకొంటున్న సమయంలో తటస్థ వైఖరితో ఉంటామని ఆర్మీ ప్రకటించడం, జంతువులే తటస్థంగా ఉంటాయంటూ ఇమ్రాన్‌ సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో వీరి మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. 

కాగా, అధికార పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ పార్టీలో తిరుగుబావుటా ఎగురవేసిన 24 మంది ఎంపిలు సైతం.. అవిశ్వాస తీర్మానానికి మద్దతునివ్వడంతో శనివారం షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. మిమ్మల్ని అనర్హులుగా ఎందుకు ప్రకటించకూడదో ఈ నెల 26 నాటికి తెలియజేయాలంటూ షోకాజ్‌ నోటీసులో ప్రభుత్వం పేర్కొంది. కాగా, అవిశ్వాస తీర్మానంపై మార్చి 28న ఓటింగ్‌ జరిగే అవకాశాలుండటం గమనార్హం.