జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారు

‘ఒక్క చాన్స్‌ అని అడిగితే.. ప్రజలు నమ్మి 151 సీట్లు ఇచ్చారు. మంచి పాలన అందిస్తాడనుకుంటే జగన్‌ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు. అప్పులు ఎక్కడొస్తాయి…ఎలా తేవాలి… ఇదే నిత్యం వైసీపీ ప్రభుత్వం ఆలోచన’’ అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాయలసీమ జిల్లాల్లో పెండింగ్‌ ప్రాజెక్టులు, ఉక్కు పరిశ్రమ, ఇతర సమస్యలపై బీజేపీ ‘రాయలసీమ రణభేరి’ సభను శనివారం కడపలో నిర్వహించింది.
ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన జరిగిన ఈ సభలో వైసీపీ ప్రభుత్వ తీరుపై కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. జగన్‌ ప్రభుత్వం వచ్చి మూడేళ్లయినా ఏ ప్రాంతం అభివృద్ధి చెందలేదని విమర్శించారు.  రాయలసీమ వెనుకబాటుతనానికి సాగునీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని స్పష్టం చేశారు. రాజకీయ, సామాజిక ప్రోత్సాహం లేకపోవడం మరో కారణంగా చెప్పారు.
‘‘రతనాల సీమ అయిన రాయలసీమ నేడు రాళ్ల సీమగా మారింది. ఈ మూడేళ్లలో రాష్ట్రానికి ఏ విధమైన పాలన అందించారో వైసీపీ నాయకులు ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పోలవరం కడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఒక్క పెండింగ్‌ ప్రాజెక్టు అయినా పూర్తిచేసిందా? ” అని ప్రశ్నించారు.
సీమ సస్యశ్యామలం కావాలంటే జగన్‌ పాలన పోయి బీజేపీ పాలన రావాలని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. “సీమ సమస్యలు, పెండింగ్‌ ప్రాజెక్టుల కోసం నాటి బీజేపీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్రలు చేశాం. మా ప్రభుత్వం వస్తే.. ప్రధాని మోదీ సారథ్యంలో ఈ ప్రాంత అభివృద్ధికి, ప్రాజెక్టుల నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం” అని భరోసా ఇచ్చారు.
రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్పులపాలై ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తుందని కిషన్ రెడ్డి హెచ్చరించారు. నిరుద్యోగులకు ఉపాధి దొరకదు. రోడ్లు కూడా వేసుకోలేని పరిస్థితి ఉంటుంది.  ఈ ప్రభుత్వంలో లిక్కర్‌, ల్యాండ్‌, శాండ్‌ మాఫియాలు తప్ప అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు.
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ మాట్లాడుతూ జగన్‌ రంగులు వేసుకుంటూ టికెట్లు అమ్ముకుంటున్నారని విమర్శించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి మాట్లాడుతూ చేపల దుకాణాలు, మాంసం కొట్లు కాదు… అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ ఎర్రచందనం రాజకీయ నాయకుల పాలుకాకుండా ప్రజాప్రయోజనాల కోసం వాడేందుకు బీజేపీ ప్రణాళిక సిద్ధం చేసిందని చెప్పారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీ, జనసేన అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావడే మాట్లాడుతూ మూడేళ్లుగా సీఎం జగన్‌ రు.6లక్షల కోట్లు ఖర్చు పెట్టారని, అయితే ఎక్కడ అభివృద్ధి జరిగిందని నిలదీశారు.
కేంద్రం ఇచ్చిన నిధులకు సంబంధించి జరిగిన దుర్వినియోగంపై సీబీఐతో విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు. సీఎం రమేశ్‌, సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్‌, మాధవ్‌, వాకాటి నారాయణరెడ్డి, భైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి, శశిభూషణ్‌రెడ్డి పాల్గొన్నారు.