నిరుడు కోటానే ఇవ్వని కేసీఆర్ మరోసారి వడ్లకై కేంద్రంతో పోరు!

రాష్ట్రంలో పండిన యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ మరోసారి కేంద్రంపై పోరాటానికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఉద్యమించనున్నారు. ఈ విషయమై  ఎర్రవల్లిలోని తన ఫాం హౌస్‌‌లో శనివారం  మంత్రులు, అధికారులతో పాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో జరిపిన అత్యవసర సమావేశంలో ఓ నిర్ణయం తీసుకున్నారు.

 క్షేత్ర స్థాయిలో తలపెట్టిన ఆందోళన కార్యక్రమాల రూపకల్పన కోసం సోమవారం టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. 

యాసంగిలో వరి సాగు చేయొద్దని సీఎం కేసీఆర్‌‌‌‌, వ్యవసాయ మంత్రి నిరంజన్‌‌‌‌ రెడ్డి సహా మొత్తం కేబినెట్‌‌‌‌, ఎమ్మెల్యేలు, అధికారులు, వ్యవసాయ శాఖ పదే పదే రైతులను హెచ్చరించారు. కేంద్రం బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌ కొనుగోలు చేయబోమని చెప్తున్నదని, కాబట్టి వరి సాగు వద్దే వద్దని చెప్పారు. 

అయితే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌‌‌ సహా ఆ పార్టీ నేతలంతా రాష్ట్ర ప్రభుత్వ వాదనను తిప్పికొట్టారు. రా రైస్‌‌‌‌ ఎంత ఇచ్చినా కేంద్రం కొంటామని తేల్చిచెప్పిందని తెలిపారు. పీసీసీ చీఫ్‌‌‌‌ రేవంత్‌‌‌‌ రెడ్డి కూడా యాసంగిలో రైతులు వరి సాగు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా కొనదో చూస్తామని హెచ్చరించారు. 

 తమ పొలాల్లో వడ్లు తప్ప వేరే పంట పండదని కొందరు రైతులు.. ఇతర పంటలు వేస్తే గిట్టుబాటు కాదని ఇంకొందరు రైతులు యాసంగిలో వరిని సాగు చేశారు. ఇట్లా యాసంగి సీజన్‌‌‌‌లో  36 లక్షల ఎకరాల్లో వరిసాగవుతున్నది. 83 లక్షల టన్నుల బియ్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు.

పంటలు చేతికి వస్తుండటంతో ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలు రాష్ట్ర సర్కారుపై పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. ఇదే జరిగితే రైతుల్లో వ్యతిరేకత ఎదురవుతుందని గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం కేంద్రంపై యుద్ధానికి దిగుతున్నట్టు తెలుస్తున్నది.

వాస్తవానికి, యాసంగిలో వడ్ల కొనుగోళ్లపై కేంద్రంతో పోరాటానికి సై అంటున్న రాష్ట్ర సర్కారు నిరుడు యాసంగి కోటా వడ్లనే ఇప్పటికీ ఎఫ్‌‌‌‌సీఐకి ఇవ్వలేదు. యాసంగి కోటాలో 6.63 లక్షల టన్నుల రా రైస్‌‌‌‌ ఎఫ్‌‌‌‌సీఐకి ఇవ్వాల్సి ఉండగా.. అందులో 5.46 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్‌‌‌‌ రైస్‌‌‌‌ ఇస్తామని ఇటీవలే లేఖ రాసింది. 

నిరుడు యాసంగిలో 92.34 లక్షల టన్నుల వడ్లు సేకరించగా, 62.53 లక్షల టన్నుల బియ్యం ఎఫ్‌‌‌‌సీఐకి ఇవ్వాల్సి ఉంది. ఇందులో 17.38 లక్షల టన్నులు రా రైస్‌‌‌‌ కాగా, 44.75 లక్షల టన్నుల బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌. ఎఫ్‌‌‌‌సీఐతో అగ్రిమెంట్‌‌‌‌ చేసుకున్న మేరకు రా రైస్‌‌‌‌ ఇవ్వలేదు. దీనిపై పలుమార్లు కేంద్రం లేఖలు రాసింది.

 అంతస్థాయిలో రా రైస్‌‌‌‌ ఇవ్వలేమని, దానికి బదులుగా ఫోర్టిఫైడ్‌‌‌‌ రైస్‌‌‌‌ ఇస్తామని రాష్ట్ర సివిల్‌‌‌‌ సప్లయీస్‌‌‌‌ లేఖ రాయడంతో దానికి ఎఫ్‌‌‌‌సీఐ అంగీకారం తెలిపింది. ఈ మేరకు బియ్యం రాష్ట్రం నుంచి ఎఫ్‌‌‌‌సీఐకి ఇవ్వాల్సి ఉంది. నిరుటి బియ్యమే కేంద్రానికి పూర్తిగా ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ వడ్ల కొనుగోలు పేరుతో ఆందోళనలకు సిద్ధమవడం గమనిస్తే ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేయకుండా, వారిని తప్పుదోవ పట్టించడం కోసమే అని స్పష్టం అవుతుంది. 

గత వానాకాలం సీజన్‌‌‌‌లోనూ వడ్ల కొనుగోళ్లపై టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఇదే తరహా పోరాటాలు చేసింది. అప్పుడు ఇందిరాపార్క్‌‌‌‌లో నిర్వహించిన ధర్నాకు సీఎం కేసీఆర్‌‌‌‌ హాజరయ్యారు. రాష్ట్రంలో పండిన వడ్లన్నీ కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎంపీలు పార్లమెంట్‌‌‌‌ సెంట్రల్‌‌‌‌ హాల్‌‌‌‌లో  నిరసన తెలిపారు.

 రాష్ట్రం నుంచి ఐదుగురు మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిశారు. వానాకాలంలో రాష్ట్రం నుంచి 40 లక్షల టన్నులకు తోడు అదనంగా 5 లక్షల టన్నుల బియ్యం సేకరణకు కేంద్రం ఓకే చెప్పింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా చేతులెత్తేస్తున్నది.