సైనిక చర్యను తక్షణమే ఆపేయండి… రష్యాకు ఐసిజె ఆదేశం 

ఉక్రెయిన్‌లో రష్యా చేపట్టిన సైనిక చర్యను తక్షణమే ఆపేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసులో ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సివుందని పేర్కొంది. 
 
‘ఈ కేసులో తుది నిర్ణయం తీసుకోవాల్సివుంది. అయితే ఈ లోగా రష్యా సమాఖ్య గత ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్‌లో కొనసాగిస్తున్న సైనిక చర్యలన్నీ ఆపేయాలి’ అని కోర్టు 13 సానుకూల ఓట్లతో మెజార్టీ ఉత్తర్వులు ఇచ్చింది. ఇద్దరు వ్యతిరేక ఓటు వేశారు. 
 
 తక్షణమే మిలటరీ ఆపరేషన్‌ను నిలిపివేసి, భద్రతా బలగాలను వెనక్కు తీసుకోవాలని ఐసీజే ఆదేశించింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఐసీజే ఆదేశాలను రష్యా తప్పక పాటించాల్సి ఉంటుంది. కాగా, అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హర్షం వ్యక్తం చేశారు. అత్యున్నత న్యాయస్థానంలో తామే గెలిచామని పేర్కొన్నారు. 
రష్యా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందంటూ ఉక్రెయిన్​ అంతర్జాతీయ కోర్టుకెక్కింది. 1948 నాటి జినోసైడ్ కన్వెన్షన్​ను రష్యా ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. గతవారం జరిగిన విచారణకు రష్యా హాజరు కాలేదు. ఆ తర్వాత రాతపూర్వక వాదనను సమర్పించిన రష్యా.. ఈ కేసును విచారించే పరిధి అంతర్జాతీయ కోర్టుకులేదని పేర్కొంది.
అయితే, జీనోసైడ్​ కన్వెన్షన్​కు సంబంధించిన సమాచారం  ఆధారంగా ప్రాథమిక నిర్ణయం తీసుకోవచ్చని ప్రిసైడిండ్​ జడ్జి జాన్ డోనోగ్ స్పష్టం చేశారు ఐసిజెలో భారత న్యాయమూర్తి జస్టిస్‌ దల్వీర్‌ భండారి కూడా మెజార్టీ ఆదేశాలకే ఓటు వేశారు. కాగా న్యాయస్థానం వద్దకు వచ్చిన వివాదాన్ని మరింత విస్తృతం చేసేలా రష్యా కానీ, ఉక్రెయిన్‌ కానీ ఆజ్యం పోసే చర్యలు చేపట్టరాదని ఐసిజె న్యాయమూర్తులంతా ఏకగ్రీవంగా ఆదేశాలు జారీ చేశారు.

చైనా న్యాయమూర్తులు ఈ ఆదేశాలతో ఏకీభవించలేదు. ఇది స్పెషల్​ మిలిటరీ ఆపరేషన్​ అని ఐసీజేలో రష్యా సమర్థించుకుంది. ఐసీజే ఆదేశాలను పాటించని దేశాలను ఐక్యరాజ్యసమితి భద్రతామండలి నివేదిస్తారు. అక్కడ రష్యాకు వీటో అధికారం ఉంది.

ఇలా ఉండగా, రష్యా, ఉక్రెయిన్‌ సంక్షోభ పరిణామాలతో ఎదురయ్యే ద్రవ్యోల్బణ భయాలు భారత్‌ బ్యాంక్‌లను ఆందోళనకు గురి చేయనున్నాయని ఎస్‌అండ్‌పి గ్లోబల్‌ రేటింగ్స్‌ ఎనలిస్ట్‌ దీపాలి సేత్‌ ఛక్రబియా పేర్కొన్నారు. ఈ పరిస్థితులను దగ్గరగా సమీక్షిస్తున్నామని తెలిపారు.  భారత బ్యాంక్‌ల పరిస్థితి స్థిరంగానే కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ.. వాటి రికవరీ మందగించే అవకాశం ఉందని చెప్పా రు. రష్యా, ఉక్రెయిన్‌ పరిణామాలు బ్యాంక్‌లపై పరోక్షంగా ప్రభావం చూపనున్నాయని తెలిపారు.