జపాన్ లో భారీ భూకంపం … నలుగురు మృతి

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 7.3గా నమోదైంది. దీని ప్రభావంతో జపాన్‌ రాజధాని టోక్యోతోపాటు వివిధ ప్రాంతాల్లో ఇళ్లు కంపించాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులయ్యారు. సుమారు 20లక్షల ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. భూకంపంతో నలుగురు మృతి చెందగా, సుమారు 97 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11.36 గంటలకు సముద్రతీర ప్రాంతమైన ఫుకుషిమాలో  భూమి కంపించింది. భూ ఉపరితలానికి 60 కిలోమీటర్ల లోతున ప్రకంపనల కేంద్రాన్ని  గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా సునామీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ అందరూ అప్రమత్తంగా ఉండాలని, తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరించారు. 

ఫుకుషిమా అణువిద్యుత్‌ కేంద్రం సురక్షితంగానే ఉందని పేర్కొన్నారు. భూ కంపం ప్రభావంతో టోక్యోతోపాటు పలు ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి.. 20 లక్షల ఇళ్లకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. మరమ్మతు చర్యలను వెంటనే చేపట్టినట్లు టోక్యో ఎలక్ర్టిక్‌ పవర్‌ కంపెనీ వెల్లడించింది. 

కాగా, పలు ప్రాంతాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా రైలు సర్వీసులను నిలిపివేశారు. జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిడా విలేకరులతో మాట్లాడుతూ భూకంపం కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామన్నారు. సహాయక చర్యలను తక్షణమే చేపడతామని పేర్కొన్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.