రష్యా నుండి భారత్ ముడిచమురు కొనుగోలుపై అమెరికా!

ఉక్రెయిన్‌పై రష్యా యుద్దానికి దిగడంతో అమెరికా, పలు ఐరోపా దేశాలు విధించిన అనూహ్యమైన ఆర్ధిక ఆంక్షలతో సతమతమవుతున్న రష్యా భారత దేశంపై రాయితీ ధరలపై ముడిచమురు సరఫరాకు ప్రతిపాదించింది. ఈ విషయమై భారత్ పరిశీలన చేస్తుండగా ఆ విధంగా రష్యా నుండి ముడిచమురు కొనుగోలు చేయడం తాము విధించిన ఆంక్షల పరిధిలోకి రాదని అమెరికా స్పష్టం చేసింది. 

రష్యా ఇవ్వజూపిన రాయితీని వాడుకొని, ఆ దేశం నుండి భారత్ ముడిచమురు కొనుగోలు చేస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తే ల్చి తేచెప్పింది. అయితే ఇక్కడొక మెలిక పెట్టింది. యుద్ధం జరుగుతున్న  సమయంలో రష్యా ప్రతిపాదనను వాడుకుంటే చరిత్రలో భారత్ తప్పు వైపు నిలబడిందన్న చెడ్డ పేరు నిలబడిపోతుందని కూడా స్పష్టం చేసింది.

రష్యా   నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేసే అవకాశం ఉందన్న వార్తలపై అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకీని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఈ  వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి ఇప్పుడు లావాదేవీలు చేస్తూ ఆ దేశానికి మద్దతుగా ఉండడమంటే ఉక్రెయిన్‌పై చేసిన దండయాత్రను సమర్థించమే అవుతుందని జెన్ సాకీ పేర్కొన్నారు.

ఇప్పుడు భారత్ ఎటువైపు ఉంటుందో నిర్ణయం తీసుకోవాలని ఆమె సూచించారు. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేయడం తాము విధించిన ఆంక్షలను ఉల్లంఘించడం కిందకు రాకపోయినప్పటికీ, అది ఒక తప్పుడు నిర్ణయంగానే చరిత్రలో మిగిలిపోతుందని ఆమె స్పష్టం చేశారు.