హాంకాంగ్‌లో ఉధృతమౌవున్న కరోనా!

హాంకాంగ్‌లో గత వారం, పది రోజులుగా కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 26 వేలకు పైగా కేసులు కొత్తగా నమోదయ్యాయి. శనివారం ఈ సంఖ్య 27 వేలకు పైగా వుండగా, గురు, శుక్రవారాలతో పోలిస్తే కొంత తగ్గినప్పటికీ ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లోని పరిస్థితులతో పోలిస్తే ఎక్కువే. శనివారం మరణాలు కూడా 198గా రికార్డయ్యాయి.

గతంలో మాదిరిగా ఉధృత పరిస్థితులు లేనప్పటికీ రోజువారీ కేసులు మాత్రం కొద్దిగా ఎక్కువగానే నమోదవుతున్నాయని హాంకాంగ్‌ నగర మేయర్‌ కేరీ లామ్‌ చెప్పారు. ఈ తరుణంలో కరోనాను అరికట్టగలిగామని చెప్పడం సాధ్యం కాదని ఆమె విలేకర్లతో పేర్కొన్నారు. చైనా మాదిరిగానే హాంకాంగ్‌ కూడా జీరో కరోనా వ్యూహాన్ని అనుసరించింది.

ఇన్‌ఫెక్షన్లు అణచివేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రధాన నగరాలన్నీ వైరస్‌తో కలిసి జీవించడమెలానో నేర్చుకుంటున్నాయి. కరోనాపై హాంకాంగ్‌ సాగించే పోరాటంలో సాయపడేందుకు చైనా నుండి వైద్య సిబ్బంది సోమవారం హాంకాంగ్‌ చేరుకున్నారు. పొరుగునే గల గుయాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ నుండి 36మంది డాక్టర్లు, 39మంది నర్సులతో కూడిన బృందం వచ్చింది.

వృద్ధుల్లో కరోనా వల్ల తలెత్తే ఇబ్బందులకు చికిత్సనందించేందుకు గానూ శ్వాసకోశ, కార్డియోవాస్కులార్‌, ఇతర విభాగాలకు చెందిన నిపుణులు వచ్చారు. హాంకాంగ్‌ స్పెషల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ రీజియన్‌ ప్రభుత్వ ఆహార, ఆరోగ్య అండర్‌ సెక్రటరీ చుయి తాక్‌ యి మాట్లాడుతూ, హాంకాంగ్‌లో కరోనా 5వ వేవ్‌ చాలా సీరియస్‌గానే వుందని తెలిపారు.

పెద్ద సంఖ్యలో రోగులు తీవ్రమైన అస్వస్థతకు గురి కాకుండా నివారించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందన్నారు. దాదాపు 80మంది చైనా డాక్టర్లు, సిబ్బంది సమర్ధవంతంగా సేవలందిస్తున్నారని ప్రశంసించారు.

కాగా, చైనాలో మంగళవారం ఒక్కరోజే అత్యధికంగా 5,280 కేసులు వచ్చాయి. ఇది సోమవారంతో పోలిస్తే రెట్టింపు అని అధికారులు వెల్లడించారు. వైరస్‌‌‌‌ ప్రభావం తీవ్రంగా ఉండటంతో చైనాలోని పలు ప్రాంతాల్లో లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ విధించారు. దీంతో దాదాపు 3 కోట్ల మంది ఇండ్లకే పరిమితయ్యారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. 

హెల్త్‌‌‌‌ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి ఎక్కడికక్కడ టెస్ట్‌‌‌‌లు చేస్తున్నారు. కరోనా తొలినాటి రోజులు మళ్లీ చైనాలో కనిపిస్తున్నాయి. దేశంలో ఎక్కడైనా ఒక్క కరోనా కేసు నమోదైనా ఆయా ప్రాంతాల్లో లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ పెట్టాలన్న ‘‘జీరో కొవిడ్‌‌‌‌” వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. దీంతో మంగళవారం 13 సిటీల్లో పూర్తి లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో పాక్షిక లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ను అమలు చేస్తున్నారు.