ఏపీ అసెంబ్లీలో రగడ….  టిడిపి సభ్యుల సస్పెన్షన్

పశ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డి గూడెంలో జరిగిన వరుస మరణాలపై అసెంబ్లీ, శాసనమండలిలో రగడ నెలకొంది. టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాల నేపథ్యంలో సభ ఆర్డర్‌లో లేకపోవడంతో అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్ ఉభయ సభలను వాయిదా వేశారు. 
 
మరోవైపు జంగారెడ్డిగూడెంలో సంభవించిన మరణాలపై మంత్రులు పేర్నినాని, ఆళ్లనాని, కొడాలి నాని సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. జంగారెడ్డిలో మృతుల ఘటనకు సంబంధించిన విషయాలను వివరించారు. అలాగే ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి కూడా సీఎంతో భేటీ అయ్యారు. జంగారెడ్డిగూడెంలో ఎలా చనిపోయారన్నది వివరించారు. టీడీపీ శవరాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.
 
సోమవారం నాడు సమావేశాలు ప్రారంభమైనప్పట్నుంచీ టీడీపీ సభ్యులు ఏపీలో సంచలనంగా మారిన జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చించాలని  పట్టుబట్టారు. అయితే ప్రభుత్వం మాత్రం దీన్ని పట్టించుకోలేదని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారం సస్పెన్షన్ వేశారు. 
 
మొత్తం ఐదుగురు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఎమ్మెల్యేలు అచ్చేన్నాయుడు, బుచ్య్య చౌదరి, వయ్యావుల కేశవరావు, రామానాయుడు, వీరాంజనేయస్వామి లను బడ్జెట్ సమావేశాల నుండి పూర్తిగా సస్పెండ్ చేశారు.  
 
 అయితే తాము అడిగింది ప్రజా సమస్య అని.. దానిపై చర్చించమని అడిగితే సస్పెన్షన్ చేయడం ఎంతవరకూ సమంజమసమని స్పీకర్ పోడియం చుట్టుముట్టి తెలుగుదేశం ఎమ్మెల్యేలు నినాదాలు చేయడం ప్రారంభించారు. 
 
 స్పీకర్ చైర్‌ను చుట్టుముట్టి కాగితాలు చింపి తమ్మినేనిపై విసిరేశారు. టీడీపీ సభ్యుల ఆందోళనలతో మార్షల్స్ రంగంలోకి దిగారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళనలను తప్పుబడుతూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.
 
సస్పెండ్ చేసినా సభ నుంచి ఎమ్మెల్యేలు కదలకపోవడంతో వారిని బయటికి తీసుకెళ్లాలని మార్షల్స్‌ను స్పీకర్ ఆదేశించారు. ఈ క్రమంలో నినాదాల మధ్యనే జంగారెడ్డిగూడెం ఘటనపై మంత్రి ఆళ్ల నాని ప్రకటన చేశారు. 
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డి గూడెంకు బయలుదేరారు. నాటుసారా తాగి మరణించిన వారి కుటుంబాలను చంద్రబాబు పరామర్శించనున్నారు. నాటుసారా తాగి నాలుగు రోజుల వ్యవధిలో 18 మంది మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కల్తీసారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని చంద్రబాబు ధ్వజమెత్తారు. 
 
 26 మంది చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మద్యపాన నిషేధమంటూ సొంత బ్రాండ్లు తెచ్చారని ఆరోపించారు. నాటుసారా వ్యాపారం చేస్తున్నది వైసీపీ నేతలేనని చెప్పారు. తాను ప్రజాహితం కోసమే పనిచేస్తానని తెలిపారు. నాటుసారా దొంగలను పట్టించి కేసులు పెట్టేవరకు ఊరుకోనని హెచ్చరించారు. 
 
26 కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం ఇస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు 25 లక్షల రూపాయలు చొప్పున పరిహారం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాసిరకం బ్రాండ్లు తెచ్చి రేట్లు పెంచడం వల్లే.. పేదలు నాటుసారా తాగే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే.. ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం ఇస్తామని చంద్రబాబు తెలిపారు.
 
కాగా,  సహజ మరణాలపై టీడీపీ రాజకీయం చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సభలో  విమర్శించారు. కల్తీ మద్యం మరణాలు గతంలో కూడా అనేక సార్లు జరిగాయన్నారు. సహజ మరణాలను కూడా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. 
 
మరోవైపు చంద్రబాబు పర్యటను విఫలం చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. నిన్న రాత్రి వైసీపీ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి చంద్రబాబును కలవద్దని ఒత్తిడి చేశారు. ఏలూరు కలక్టరేట్‌కు వెళ్లాలని అక్కడ రూ. 10 లక్షలు ఇస్తారని ఆశపెట్టారు. అయితే తాము చంద్రబాబును కలిసే తీరుతామని బాధిత కుటుంబాలు స్పష్టం చేశాయి