యుపిలో సగానికిపైగా హిందువులు బీజేపీకే ఓటు!

తాజాగా ముగిసిన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మతపరమైన ఓటింగ్‌ ధోరణి స్పష్టంగా కన్పించిందని సెంటర్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌ (సీఎస్‌డీఎస్‌)–లోక్‌నీతి పోస్ట్‌ పోల్‌ సర్వే పేర్కొంది. హిందూ ఓట్లలో సగానికి పైగా బీజేపీకి పడగా ఏకంగా మూడింట రెండొంతుల మంది ముస్లింలు సమాజ్‌వాదీకి ఓటేసినట్టు వివరించింది.

అయితే బీజేపీకి ముస్లిం ఓట్లు, అఖిలేశ్‌ సారథ్యంలోని ఎస్పీకి హిందూ ఓట్లు పెరిగినట్టు తెలిపింది. ‘‘2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ముస్లిం ఓట్లు స్వల్పంగా పెరిగాయి. ఎస్పీకి హిందూ ఓట్లు కూడా 18 శాతం నుంచి 26 శాతానికి పెరిగాయి’’ అని వెల్లడించింది. 

హిందూ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో భాగంగా ఎన్నికల ప్రచార సమయంలో అఖిలేశ్‌ యాదవ్‌ పలు హిందూ  పలు దేవాలయాలను సందర్శించారు. మఠాలకు వెళ్లారు. బీజేపీ తరఫున ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాథ్‌ కూడా 80 శాతం మంది ప్రజలు బీజేపీకే మద్దతుగా ఉన్నారంటూ పదేపదే ‘80–20’ ప్రచారం చేశారు. 

 సమగ్రమైన శాంపిల్స్‌ ఆధారంగా సర్వే జరిగినట్టు సీఎస్‌డీఎస్‌ రీసెర్చ్‌ విభాగమైన లోక్‌నీతి కో డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సంజయ్‌ కుమార్‌ తెలిపారు.

సిఎస్‌డిఎస్‌లోక్‌నీతి సర్వే వివరాల మేరకు ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో హిందూ ఓట్లలో బిజెపికి 54 శాతం ఓట్లు వచ్చాయి. 217 అసెంబ్లీ ఎన్నికలలో ఈ వాటా 47 శాతంగా ఉంది. ఎస్‌పికి ఈసారి హిందూ ఓటర్లలో వాటా 26 శాతంగా నమోదు అయింది. 

ఇది గత అసెంబ్లీ ఎన్నికలలో ఉన్న 18 శాతంతో పోలిస్తే 8 శాతం ఎక్కువ. బిఎస్‌పికి ఈసారి 14 శాతం హిందూ ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ రెండు శాతం హిందూ ఓట్లను గెల్చుకుంది. ఈ పార్టీ ఇక్కడ రెండు సీట్లతోనే సరిపెట్టుకుంది. 

ఈసారి బిజెపికి ముస్లిం ఓట్ల శాతం పెరిగినా విజేతలైన వారిలో ఒక్క ముస్లిం వ్యక్తి లేరు. 273 మంది బిజెపి మిత్రపక్షాల విజేతలలో ఒక్కరు కూడా ముస్లిం వ్యక్తి లేరు. ఈసారి 8 శాతం ముస్లిం ఓట్లను దక్కించుకుని ఇంతకు ముందటి 3 శాతం నుంచి మెరుగుపడ్డ బిజెపి ఈసారి పార్టీ తరఫున ఓ ఒక్క ముస్లిం అభ్యర్థిని పోటీకి దింపలేదు. 

అయితే బిజెపి మిత్రపక్షం అప్నాదశ్ నుంచి ఒక్క ముస్లిం అభ్యర్థి బరిలో నిలిచారు. రామ్‌పూర్‌లోని సురార్ నుంచి ఆజం ఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజం కు పోటిగా అప్నాదళ్ అభ్యర్థి నిలిచారు. అయితే జూనియన్ ఆజం చేతిలో ఓడారు. ఈసారి బిఎస్‌పికి ముస్లిం ఓట్ల శాతం బాగాపడిపోయింది. ఈ విధంగా కేవలం ఒక్క సీటుకు పరిమితం అయింది. గత ఎన్నికలలో 19 శాతం వరకూ ఉన్న ముస్లిం ఓట్లను ఈసారి బిఎస్‌పి ఆరు శాతానికి దిగజార్చుకుంది.

ఇక ముస్లిం అనుకూలతను ప్రదర్శించారనే ప్రచారం పొందిన కాంగ్రెస్‌కు ఈసారి ముస్లిం వర్గాల నుంచి దక్కిన మద్దతు కేవలం 3 శాతమే. ఇంతకు ముందటి 19 శాతం ముస్లిం ఓట్లు ఈసారి 3 శాతానికి పడిపొయ్యాయి. ఈసారి ఎన్నికలలో బిఎస్‌పి అత్యధికంగా 87 మంది ముస్లింలను పోటికి దింపింది.

తరువాతి స్థానంలో కాంగ్రెస్ 75 మందిని, తరువాతి క్రమంలో ఎస్‌పి 64 మంది ముస్లింలను బరిలోకి నిలిపింది. ఈసారి ఎన్నికల్లో 34 మంది ముస్లింలు విజేతులు అయ్యారు. వీరిలో 31 మంది ఎస్‌పి వారే ఉన్నారు.