పేటీఎం పేమెంట్ బ్యాంక్‌పై ఆర్‌బిఐ నిషేధం

కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా పేటీఎం పేమెంట్ బ్యాంక్‌పై ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) ఆంక్షలు విధించింది. బ్యాంక్‌లో ‘మెటీరియల్’ పర్యవేక్షణ సమస్యలను గమనించిన కారణంగా రిజర్వు బ్యాంక్ ఈ చర్యలు చేపట్టింది. ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆర్‌బిఐ ప్రకటించింది. 
 
అంతేకాదు బ్యాంక్ ఐటి వ్యవస్థపై సమగ్ర ఆడిట్ నిర్వహించేందుకు ఒక ఆడిట్ సంస్థను నియమించాలని కూడా పేటీఎంను ఆదేశించినట్టు ఆర్‌బిఐ ప్రకటనలో పేర్కొంది. ఐటి ఆడిట్ నివేదికను పరిశీలించిన తర్వాత ఆర్‌బిఐ నుంచి ప్రత్యేక అనుమతి మేరకు పేటీఎం పేమెంట్ బ్యాంక్ కొత్త కస్టమర్లను చేర్చుకునే వీలు కల్గుతుంది. 
 
డిసెంబర్‌లో ఆర్థిక సేవలను విస్తరించేందుకు గాను పేటీఎం పేమెంట్ బ్యాంక్ సేవలకు రిజర్వు బ్యాంక్ అనుమతి ఇచ్చింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 సెక్షన్ 35ఎ కింద పేటీఎం పేమెంట్ బ్యాంక్‌పై చర్యలు చేపట్టినట్టు ఆర్‌బిఐ ప్రకటనలో తెలిపింది. 
 
పేటీఎం పేమెంట్స్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ విజయ్ శేఖర్ శర్మకు పేటీఎం పేమెంట్ బ్యాంక్‌లో 51 శాతం వాటా ఉంది. పేమెంట్స్ బ్యాంక్ మాతృ సంస్థ వన్97 కమూనికేషన్స్ లిస్టింగ్ తర్వాత కంపెనీ విలువ విషయంలో ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిణామం ప్రాధాన్యతను సంతరించుకుంది.