పీఎఫ్‌పై వడ్డీ రేటు గరిష్టంగా తగ్గింపు

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌ (ఈపీఎఫ్ఓ) పై కేంద్రం వడ్డీ రేటు తగ్గించింది. 2019-20లో 8.5 శాతం ఉన్న వడ్డీ రేటును 2021-22 సంవత్సరానికిగాను 8.1 శాతానికి తగ్గించినట్లు కేంద్ర కార్మికశాఖ వర్గాలు తెలిపాయి. 
 
1977-78 తర్వాత ఇంత తక్కువ వడ్డీ రేటు నిర్ణయించడం ఇదే మొదటిసారి. దానితో  పిఎఫ్‌పై వడ్డీరేటును 44 ఏళ్ల కనిష్ఠానికి తగ్గించిన్నట్లు అయింది. 1977-78 లో పీఎఫ్‌పై 8శాతం వడ్డీ ఇచ్చారు. 2018-19, 2016-17లో 8.65శాతం చొప్పున వడ్డీ జమ చేయగా.. 2013-14, 2014-15లో 8.75శాతం చొప్పున ఇచ్చారు.
2015-16లో 8.8శాతం చొప్పున జమచేశారు. అయితే కరోనా దృష్ట్యా పిఎఫ్‌లో ఉన్న నగదును చందాదారులు విత్‌డ్రా చేయడం, జమయ్యే సొమ్ము తగ్గిపోవడంతో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీని ఏడేళ్ల కనిష్ఠానికి తగ్గించి 8.5శాతంగా ఇచ్చారు. గత ఆర్థిక సంవత్సరానికి (2020-21)కూడా ఇదే 8.5శాతం వడ్డీని కొనసాగించారు.
అప్పట్లో అతి తక్కువగా 8 శాతం వడ్డీ రేటు ఉండగా, ఇప్పుడు 8.1 శాతం మాత్రమే ఉంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ కింద ఐదు కోట్ల మంది సభ్యులున్నారు. గుహవటిలో జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ట్రస్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి సంబంధించిన ప్రతిపాదనలను త్వరలో కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు. అక్కడ ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడిన తర్వాత, వడ్డీ సభ్యుల అకౌంట్లలో క్రెడిట్ అవుతుంది.