రూ. 1.42 లక్షల కోట్లతో జమ్ముకశ్మీర్ బడ్జెట్

కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌కు సంబంధించి రూ.1.42 లక్షల కోట్లతో 2022 23 బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ సోమవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ఈ మేరకు ప్రతిపాదనలు అధ్యయనం చేయడానికి తగిన సమయం ఉందని విపక్షాలకు ఆమె సూచించారు. 

అలాగే జమ్ముకశ్మీర్ 2021 22 అనుబంధ పద్దును రూ. 18,860.32 కోట్లతో సభ ముందు ఉంచారు. అదే రోజు వీటిపై చర్చ జరగాలన్న ప్రత్యేక నిబంధనలను రద్దు చేయాలని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానానికి కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారీ, ఆర్‌ఎస్‌పి సభ్యుడు ఎన్‌కె ప్రేమ చంద్రన్ అభ్యంతరం తెలిపారు. 

జమ్ము కాశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని మనీష్ తివారి ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరలేకపోయిందని చెబుతూ  దాని పూర్తి రాష్ట్ర హోదాను ఎప్పుడు పునరుద్ధరిస్తారని ప్రశ్నించారు.

ఈ ప్రక్రియకు సంబంధించి ప్రాథమిక నియమాల్లో భాగంగా ఏర్పడిన రూల్ 205ను మాఫీ చేయలేమని వాదించారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ రెండు గంటల తరువాత దీనిపై చర్చ జరుగుతుందని చెప్పారు. 

స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ ఈరోజు జరగాల్సిన చర్చ గురించి బిజెనెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో అంగీకరించడమైందని చెప్పారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన రెండు గంటల తరువాత చర్చించడానికి ఆ కమిటీ సమావేశంలో అంగీకరించడమైందని టిఎంసి సభ్యుడు సుదీప్ బంధోపాధ్యాయ సూచించారు.