ఉక్రెయిన్‌లో అమెరికా బయోలాబ్స్‌

ఉక్రెయిన్‌లో తమ బయోలాబ్స్‌ ఉన్నాయని అమెరికా అంగీకరించింది. ఉక్రెయిన్‌లోని ‘బయోలాబ్స్‌’ రష్యా వశం కాకుండా అడ్డుకునేందుకు కీవ్‌తో కలిసి తాము పనిచేస్తున్నామని తెలిపింది. ఉక్రెయిన్‌ తన బయోలాబ్‌లలో ఎటువంటి మెటీరియల్స్‌ ఉండకుండా చేసే యత్నంలో వాషింగ్టన్‌ సహాయం అందిస్తోందని యుఎస్‌ అండర్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ విక్టోరియా న్యూలాండ్‌ తెలిపారు. 

ఈ ప్రయత్నం రష్యా దాడి ముగిసే వరకు కొనసాగుతుందని ఆమె చెప్పరు. ఉక్రెయిన్‌లో బయోలాబ్స్‌ ఉన్నాయని, వాటిపై రష్యా సైన్యం, సైనికులు నియంత్రణ సాధించేందుకు యత్నిస్తున్నాయని.. ఈ అంశంపై తాము ఆందోళన చెందుతున్నామని విదేశీ సంబంధాల కమిటీ ముందు తాను  వాంగ్మూలం ఇచ్చినట్లు నూలాండ్‌ వెల్లడించారు. 

బయోలాబ్స్‌ విషయంలో ఉక్రెయిన్‌కు సహాయం అందిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. పెంటగాన్‌తో కలిసి అత్యంత వ్యాధికారకమైన బ్యాక్టీరియా, వైరస్‌లతో పాటు ప్రమాదకర పదార్థాలను సంరక్షిస్తున్న బమోలాబ్స్‌ని ధ్వంసం చేసేందుకు ఉక్రెయిన్‌ అధికారులు యత్నిస్తున్నారని రష్యా సైన్యం వెల్లదించింది. 

ఆంత్రాక్స్‌తో పాటు తీవ్రంగా వ్యాప్తి చెందే భయంకరమైన వైరస్‌లపై ఈ లాబ్‌లు పరిశోధనలు చేస్తున్నాయని రష్యా మిలటరీకి చెందిన లెఫ్టినెంట్‌ జనరల్‌ ఇగోర్‌ కిరిల్లోవ్‌ తెలిపారు.  రష్యా దళాలు ఉక్రెయిన్‌లోకి ప్రవేశించడంతో, తమ దేశానికి సరిహద్దులో అమెరికా నిధులతో నడుస్తున్న ప్లేగు, ఆంత్రాక్స్‌ వంటి వ్యాధికారక ప్రయోగశాలలను అత్యవసరంగా ధ్వంసం చేయాలని కీవ్‌ ప్రభుత్వం ఆదేశించిందని ఆరోపించారు. 

‘ప్లేగు, ఆంత్రాక్స్‌, తులరేమియా, కలరా, ఇతర ప్రాణాంతక వ్యాధులు బయో ల్యాబరేటరీలను ధ్వంసం చేయాలని ఉక్రెయిన్‌ ఆరోగ్య శాఖ జారీచేసిన ఆదేశాలను గత నెల 24న ఆ ఉద్యోగుల నుండి డాక్యుమెంట్లు అందుకున్నాం’ అని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అమెరికా నిధులు సమకూర్చుతోన్న జీవ ఆయుధాల ప్రోగ్రాం సాక్ష్యాలను తుడిచేసేందుకు ఉక్రెయిన్‌ ప్రభుత్వం అత్యవసర ప్రక్షాళన చేపట్టిందని రష్యా తెలిపింది. 

ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని, త్వరలోనే బయటపెడతామని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. అందులో ల్యాబ్‌లను ధ్వంసం చేయమని ఉక్రెయిన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన ఉత్తర్వులు ఉన్నాయని, కాగా, వాటిని రేడియేషన్‌, కెమికల్‌, బయోలాజికల్‌ ప్రొటెక్షన్‌ స్పెషలిస్టులు విశ్లేషిస్తున్నారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటి ఫలితాలను త్వరలో అందిస్తామని పేర్కొంది.

బయోలాజికల్‌ వెపన్స్‌ కన్వెన్షన్‌ను ఉల్లంఘించినట్లు రష్యా నిపుణులు రుజువుచేస్తారనే ఆందోళనతో ఉక్రెయిన్‌; అమెరికాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న బయోలాబ్స్‌ ధ్వంసం చేసేందుకు అక్కడి అధికారులు యత్నిస్తున్నారని కిరిల్లోవ్‌ ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలను ఉక్రెయిన్‌ ఖండించింది.