పాక్ లో భారత్ విమాన హైజాకర్ హత్య

179 మంది ప్రయాణికులతో కూడిన ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని హైజాక్‌ చేసిన నిందితుడు మిస్త్రీ జహూర్‌ ఇబ్రహీం పాకిస్తాన్‌లోని కరాచీలో హత్యచేయబడినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. జైషే- మొహమ్మద్‌ సంస్థకి చెందిన ఉగ్రవాది, గత కొన్నేళ్లుగా జహిద్‌ అఖుంద్‌ పేరుతో తిరుగుతున్నాడని తెలిపింది.

 మార్చి 1న కరాచీలోని అక్తర్‌ కాలనీ -1లో గుర్తుతెలియని దుండగుడు అతి సమీపం నుండి కాల్చి చంపినట్లు తెలిపారు. ప్రస్తుతం జహూర్‌ అక్తర్‌ కాలనీలో ఒక ఫర్నిచర్‌ కంపెనీని నడుపుతున్నారు. జహూర్‌ అంత్యక్రియలకు ఉగ్రవాద సంస్థల స్థాపకుడు మసూద్‌ అజహర్‌ సోదరుడు, జైషే మొహమ్మద్‌ చీఫ్‌ జహూద్‌ అంత్యక్రియలకు హాజరుకానున్నట్లు సమాచారం.

1999 డిసెంబర్‌ 24న ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం ఐసి-814ని ఐదుగురు నిందితులు హైజాక్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులతో పాటు 11 మంది విమాన సిబ్బంది ఉన్నారు. అమృత్‌సర్‌, దుబాయ్, లాహోర్‌ లకు ప్రయాణిస్తున్న ఆ విమానాన్ని ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్‌కి మళ్లించారు. 

ఉగ్రవాది మసూద్‌ అజహర్‌ అల్వి, సయ్యద్‌ ఒమర్‌ షేఖ్‌, ముస్తక్‌ అహ్మద్‌ జార్గర్‌లను విడుదల చేయాలంటూ డిమాండ్‌ చేశారు. ఒక సమయంలో చర్చలు విఫలం కావడంతో భారత్‌కి చెందిన 25 ఏళ్ల రూపిన్‌ కత్యాల్‌ని జహుర్‌ ఇబ్రహీం కత్తితో పొడిచి చంపాడు. ఈ హైజాక్‌ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.