పెట్రోలు, డీజిల్ ధరలను నిర్ణయించేది ఆయిల్ కంపెనీలే

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పెట్రోలు, డీజిల్ ధరలను చమురు కంపెనీలే నిర్ణయిస్తాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో క్రూడాయిల్ కొరత లేదని చెప్పారు. ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. 
హర్‌దీప్ సింగ్ పురి  విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, క్రూడాయిల్ కొరత ఉండబోదని అందరికీ హామీ ఇస్తున్నానని చెప్పారు. మనకు అవసరమైనదానిలో  85 శాతం  క్రూడాయిల్‌ను, అదేవిధంగా 50 నుంచి 55 శాతం వరకు గ్యాస్‌ను దిగుమతి చేసుకోవలసి ఉంటుందని, అయినప్పటికీ  ఇంధన అవసరాలు తీరేవిధంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
గత ఏడాది లీటరు పెట్రోలు ధరను రూ.5 చొప్పున తగ్గించామని, అదేవిధంగా లీటర్ డీజిల్ ధరను రూ.10 చొప్పున తగ్గించామని గుర్తు చేశారు.   ఐదు రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికలు జరుగుతున్నందువల్ల పెట్రోలు, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించిందని యువ నేతలు ఆరోపించారని రాహుల్ గాంధీ పేరెత్తకుండా పేర్కొ న్నారు. పైగా, వీటి ధరలను ఎన్నికల అనంతరం మళ్ళీ పెంచుతారని ప్రచారం చేశారని విమర్శించారు.
అయితే, అంతర్జాతీయంగా ధరలు పెరగడానికి కారణాలను తెలుసుకోవాలని కేంద్ర మంత్రి హితవు చెప్పారు. అంతర్జాతీయ ధరలనుబట్టి చమురు ధరలను నిర్ణయిస్తారని చెప్పారు. ప్రపంచంలో ఓవైపు యుద్ధం వంటి పరిస్థితి ఉందని, దీనిని ఆయిల్ కంపెనీలు పరిగణనలోకి తీసుకుంటాయని ఆయన తెలిపారు.