ప్రత్యేక రైలులో లోకో పైలట్, గార్డు, టీటీఈలందరూ మహిళలే

లోకో పైలట్, గార్డు, టీటీఈ, ఆర్పీఎఫ్ సిబ్బంది అంతా మహిళలు కలిసి ప్రత్యేక రైలు నడిపిన ఘటన తాజాగా వెలుగుచూసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని చక్రధర్‌పూర్ (సీకేపీ) డివిజన్‌లో లోకో పైలట్, గార్డు, టీటీఈ, భద్రతా సిబ్బంది సహా అందరూ మహిళా సిబ్బందితో కలిసి తొలిసారిగా ఎక్స్‌ప్రెస్ రైలును నడిపారు.
 
13288 నంబరు సౌత్ బీహార్ ఎక్స్‌ప్రెస్ దానాపూర్ నుంచి దుర్గ్ మధ్య నడుస్తోంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సికెపి నుంచి రూర్కెలా స్టేషన్ ల మధ్య మహిళా ప్రత్యేక రైలుగా మార్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
 
ఈ ప్రత్యేక  రైలుకు డివిజనల్ రైల్వే మేనేజర్ విజయ్ కుమార్ సాహు, రైల్వే మహిళా సంక్షేమ సంస్థ చైర్మన్ అంజులా సాహుతో కలిసి పచ్చజెండా ఊపారు.మహిళా దినోత్సవం రోజున మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యం అని  సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ మనీష్ పాఠక్ చెప్పారు.

27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు
కరోనా వల్ల రద్దు చేసిన అంతర్జాతీయ విమాన సర్వీసులను ఈ నెల 27వ తేదీ నుంచి పునరుద్ధరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సర్వీసులు సరిగ్గా రెండేళ్ల తర్వాత ప్రారంభం కానున్నా యి. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో 2020 మార్చి 23న అంతర్జాతీయ విమానాలను రద్దు చేశారు. 2020 జూలై నుంచి 37 దేశాలకు సర్వీసులను అనుమతించారు.
తాజాగా కరోనా  వ్యాప్తి తగ్గడం, ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ విస్తృతంగా సాగడంతో అంతర్జాతీయ సర్వీసులను పూర్తి స్థాయిలో ప్రారంభిస్తున్నట్లు పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.  కాగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం స్పైస్‌ జెట్‌ అందరూ మహిళా సిబ్బందితో 10 విమానాలను నడిపింది. ఇందులో హైదరాబాద్‌-తిరుపతి, తిరుపతి-హైదరాబాద్‌ మధ్య నడిచిన సర్వీసులు కూడా ఉండడం విశేషం.