నిర్వాసితుల పునరావాసంపై కేంద్ర మంత్రి అసంతృప్తి 

పోలవరం నిర్వాసితుల పునరావాసం వేగంగా జరగక పోతుండడం పట్ల కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి పోలవరం ప్రాజెక్టును హెలికాఫ్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. 

అనతంరం పోలవరం పునరావాస గ్రామాల్లో పర్యటిస్తూ  నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. ఈ భేటీలో నిర్వాసితులకు పరిహారంపై షెకావత్‌ ఆరా తీసినట్లు తెలుస్తోంది. పునరావాస కల్పన కేవలం 20.19 శాతమే పూర్తికావడంపై చర్చించారు. 

గతంలో ఆమోదించిన ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం.. రూ.55,656.87 కోట్లకు క్లియరెన్స్ జగన్ ఇవ్వాలని కోరారు. 194 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి అవసరమయ్యే.. భూసేకరణ, పునరావాస కార్యక్రమాలపై కేంద్రమంత్రి ఆరా తీశారు.

పునరావాస పనులపై అధికారులు మరింత శ్రద్ధపెట్టాలని కేంద్ర మంత్రి సూచించారు. ఇచ్చిన మాటకు నరేంద్ర మోదీప్రభుత్వం  కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి  భరోసా ఇచ్చారు.  పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. ప్రాజెక్టు మధ్యలో మరోసారి పర్యటిస్తానని షెకావత్‌ తెలిపారు. పునరావాస కాలనీల్లో వసతులు బాగున్నాయని ప్రశంసించారు.

పునరావాస పనులపై అధికారులు మరింత శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. పోలవరం ఆంధ్ర రాష్ట్రానికి ఒక జీవనాడి అని, పోలవరం పూర్తయితే ఎపి మరింత సస్యశ్యామలం అవుతుందని జగన్‌ తెలిపారు. 

జగన్ తో కలసి  కేంద్ర మంత్రి ఉదయం 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరిపేట పునరావాస కాలనీకి చేరుకుని నిర్వాసితులతో మాట్లాడారు. అక్కడినుంచి 11.20కి పశ్చిమగోదావరిలోని తాడువాయి పంచాయతీ చల్లావారిగూడెం కాలనీకి చేరుకుని నిర్వాసితులతో కూడా మాట్లాడారు. ఆ తర్వాత ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించి, అధికారులతో సమీక్షించారు.

పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు, చింతూరు మండలాల్లో సుమారు 6వేలకుపైగా గిరిజనేతర కుటుంబాలను కాలనీలకు తరలించాలని నిర్ణయించారు. వీటి పరిధిలో 44గ్రామాలు ఉండగా, వీరి పునరావాసానికి 530 ఎకరాల సేకరణకు రూ. 287కోట్లు వ్యయం చేశారు. మౌలిక వసతుల కోసం మరో రూ.137 కోట్లు సమకూర్చారు. 

పునరావాస కాలనీల్లో 3,905 మందికి ప్రభుత్వమే ఇళ్లు కట్టించాల్సి ఉండగా, మిగిలిన వారు సొంతంగా నిర్మించుకోవడానికి రూ.2.80 లక్షల చొప్పున కేటాయిస్తామని తెలిపింది. కార్మల్‌పురం, ప్రగడపల్లి, వింజరం, గురువాయిగూడెం, తిరుమలాపురంలో 180 ఎకరాలు సేకరించి ఇళ్ల నిర్మాణానికి 9.3 కోట్లు వెచ్చించారు. 

భూమికి భూమి పథకం కింద మరో రూ.37 కోట్లు చెల్లించారు. రెండో ఫేజ్‌లో 3వేల కుటుంబాలను తరలించేందుకు కాలనీల నిర్మాణానికి రూ.31 కోట్లు ఖర్చు చేశారు. మరోవైపు వ్యక్తిగత పరిహారంగా తమకు చెల్లించాల్సిన మొత్తాన్ని 10లక్షలకు పెంచి చెల్లిస్తేనే తాము గ్రామాల నుంచి కదలబోమని నిర్వాసితులు భీష్మించారు. 

తాను అధికారంలోకి వస్తే.. బాధితులకు వ్యక్తిగత కుటుంబ పరిహారాన్ని ఐదు నుంచి 10 లక్షలకు పెంచుతానని ఎన్నికల ప్రచారంలో జగన్‌ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఆ పరిహారం ఊసే లేదు. దీనిపై బాధితులు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం రూ.131 కోట్లు విడుదల చేసింది. 

దీంతో నిర్వాసితులు దీక్షలు విరమించుకున్నారు. తిరిగి చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 2 వేల 400 మందికి పరిహారం చెల్లించాల్సి ఉండగా, వీరిలో ఇంకా 748 మందికి మాత్రమే పరిహారం పెండింగ్‌లో ఉందని చెబుతున్నారు.

మరోవంక, ప్రాజెక్ట్ నిర్మాణం కూడా నత్తనడకన నడుస్తున్నది. టిడిపి హయాంలోనే 70 శాతం నిర్మాణం పూర్తి కాగా, గత రెండున్నరేళ్లలో 10 శాతమే పనులు జరిగాయి. 2020 నాటికి నిర్మాణం పూర్తి చేస్తానని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన జగన్ 2024 నాటికి కూడా పూర్తి చేసే అవకాశాలు కనిపించడం లేదు.