చర్చలు, దౌత్య మార్గాలతోనే పరిష్కారం!

ఉక్రెయిన్‌ సంక్షోభానికి చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు.  ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ‘క్వాడ్‌’ దేశాధినేతలు సమావేశమయ్యారు. గురువారం వర్చువల్‌గా జరిగిన ఈ భేటీలో ప్రధాని  మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా పాల్గొన్నారు. .
ఈ యుద్ధం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై క్వాడ్‌ నేతలు చర్చించారు. గత ఏడాది సెప్టెంబరులో జరిగిన క్వాడ్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతిపైనా సమీక్షించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, సామరస్యాలను కాపాడాలని.. ఈ అంశాలపైనే క్వాడ్‌ ప్రధానంగా దృష్టి పెట్టాలని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఆయా విషయాల్లో క్వాడ్‌ దేశాల మధ్య దృఢమైన సహకారం ఉండాలని ఆకాంక్షించారు. మరోవైపు అత్యవసరంగా ఏర్పాటు చేసిన ఈ క్వాడ్‌ సమావేశంలో ఉక్రెయిన్‌పై దాడుల విషయంలో రష్యాను ఖండించాలంటూ భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు బైడెన్‌ ప్రయత్నించారు.
రష్యాను ఖండించే విషయంలో ఎలాంటి సాకులు, సందేహాలకు తావు ఉండకూడదని పేర్కొన్నారు. భారత్‌ను బెదిరించేందుకు చైనా కార్డ్‌ను ప్రయోగించారు. క్వాడ్‌ సభ్య దేశాల్లో జపాన్‌, ఆస్ట్రేలియా ఇప్పటికే అమెరికాతో కలిసి పనిచేస్తున్నాయి.