స్వయం సమృద్ధి సాధించడం మినహా మార్గం లేదు 

అత్యంత ముఖ్యమైన రంగాల్లో స్వయం సమృద్ధి సాధించడం మినహా భారత దేశానికి మరొక దారి లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సెమీకండక్లర్లు వంటి కీలకాంశాల్లో స్వయంసమృద్ధి కోసం కృషి చేయడం వల్ల ‘మేక్ ఇన్ ఇండియా’ పథకం మరింత బలోపేతమవుతుందని ఆయన చెప్పారు.

బడ్జెట్ ప్రతిపాదనలపై పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యాభివృద్ధి శాఖ ‘ప్రపంచం కోసం మేక్ ఇన్ ఇండియా’ శీర్షికతో నిర్వహించిన  వెబినార్‌ లో మోదీ మాట్లాడుతూ, సెమీకండక్లర్ల విషయానికి వచ్చేసరికి స్వయం సమృద్ధి సాధించడం మినహా భారత దేశానికి మరొక దారి లేదని పేర్కొన్నారు. ఈ రంగం ‘మేక్ ఇన్ ఇండియా’కు నూతన అవకాశాలను తీసుకొచ్చిందని ఆయన చెప్పారు.

మన దేశంలోని ముడి ఇనుప ఖనిజం విదేశాలకు వెళ్తోందని, నాణ్యమైన ఉక్కును మనం ఆ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామని ప్రధాని చెప్పారు. దిగుమతులు సాధ్యమైనంత తక్కువగా ఉండేవిధంగా ఇండియన్ మాన్యుఫ్యాక్చరర్స్ కృషి చేయాలని, ఇతర దేశాలపై ఆధాపడవలసిన అవసరాన్ని తగ్గించాలని ప్రధాని  పిలుపునిచ్చారు.

భారత దేశం వంటి అతి పెద్ద దేశం కేవలం మార్కెట్‌గా మిగిలిపోతే, ఎన్నటికీ అభివృద్ధి చెందబోదని, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం సాధ్యం కాదని ప్రధాని స్పష్టం చేశారు. కరోనా  మహమ్మారి సమయంలో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలు ఏ విధంగా ధ్వంసమయ్యాయో మనం చూశామని గుర్తు చేశారు.

ప్రపంచం భారత దేశాన్ని ఓ మాన్యుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్‌గా చూస్తోందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)లో మాన్యుఫ్యాక్చరింగ్ రంగం వాటా 15 శాతమని, అయితే ‘మేక్ ఇన్ ఇండియా’లో అనంతరమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మాన్యుఫ్యాక్చరింగ్ బేస్‌ను బలోపేతం చేయడానికి మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.