ఉక్రెయిన్ యుద్ధంతో రష్యా ఏకాకిగా  మారిందా?

రాజ్య కాంక్షతోనే రష్యా పొరుగు దేశమైన ఉక్రెయిన్‌‌‌‌పై యుద్ధాన్ని ప్రకటించింది. అగ్రరాజ్యమైన అమెరికా, యూరోప్​ దేశాలు తన వద్దకు వచ్చే సాహసం చేయవని, నాటో దళాలు కూడా కల్పించుకోవని, వారంతా యుద్ధాలతో అలసి పోయారని గ్రహించిన తర్వాతే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగారు. నాలుగు రోజుల్లో ఉక్రెయిన్​ తమ పాదాక్రాంతం అవుతుందని ఆశించారు. 

కానీ ఉక్రెయిన్‌‌‌‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌‌‌‌‌‌‌‌ జెలెన్‌‌‌‌స్కీ మొక్కవోని ధైర్యంతో పోరాడుతుండటంతో ఎనిమిది రోజులు గడిచినా ఉక్రెయిన్‌‌‌‌ను రష్యా సొంతం చేసుకోలేకపోయింది. దీని పర్యవసానాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా? అన్నమాట పక్కనుంచితే.. రష్యా చర్యలను అన్ని దేశాలూ తప్పుపడుతున్నాయి. ఏ దేశం కూడా వారికి మద్దతు పలకడం లేదు. ఈ క్రమంలో రష్యా ఏకాకిగా మిగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌‌‌‌ నగరానికి చేరువలో రష్యా దళాలు మోహరించి, 24 గంటల్లో సిటీని స్వాధీనం చేసుకోగలం అనుకున్నప్పటికీ వారం రోజులు దాటినా అది సాధ్యం కావడం లేదు. ఇక, రష్యా సైన్యం యుద్ధం పట్ల ఆసక్తిగా లేదనే వార్తలు వస్తున్నాయి. వారు నైతికంగా దెబ్బతిని ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. రష్యాలో యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పుతిన్ రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

మరోవైపు, సినిమాల నుంచి అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన ఉక్రెయిన్  అధ్యక్షుడు జెలెన్‌‌‌‌స్కీ.. యుద్ధంతో దేశం వదిలి పారిపోతాడని తొలుత అంచనా వేశారు. అయితే మరే ప్రజాస్వామ్య దేశంలో జరగని విధంగా దేశాధ్యక్షుడే ముందుండి రష్యా సేనలకు ప్రతిఘటన ఇవ్వడమే కాకుండా, మహిళలు, యువత సహా సాధారణ పౌరులు సైతం ఆయుధాలు చేబట్టి యుద్ధంలోకి రావడం ప్రపంచానికే విస్మయం కలిగిస్తోంది.

రష్యా జాతుల సమస్యపై మౌలిక ప్రశ్నలు

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం గురించి పలు అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచంపై ఆధిపత్యం కోసం కుట్రలు, కుతంత్రాలు, వ్యూహాలు రచిస్తూ, అమలు చేస్తున్న అమెరికాను ఈ సందర్భంగా పలువురు నిందిస్తున్నారు. సోవియట్ యూనియన్ పతనం తర్వాత కూడా రష్యాను చావుదెబ్బ కొట్టాలన్న దుర్నీతిని అమెరికా అమలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. 

నాటో అస్తిత్వమే ఈ యుద్ధానికి కారణమని అందరూ అంగీకరిస్తున్నారు. ప్రత్యర్థి వార్సా కూటమి కనుమరుగైపోయినా, అమెరికా నేతృత్వంలో నాటో సైనిక కూటమి విస్తరణలో భాగంగా ఉక్రెయిన్ ను సభ్యదేశంగా చేర్చుకోవడానికి వేసిన ఎత్తుగడలను ఎండగడుతున్నారు. ఉక్రెయిన్ నాటోలో చేరితే తమ రక్షణ ప్రమాదంలో పడుతుందనే రష్యా ఆందోళన పట్ల సానుభూతి చూపుతున్నారు. 

అయితే ఈ సందర్భంగా ఒక ప్రధాన మౌలిక సమస్యను ప్రముఖ వామపక్ష మేధావి టి. లక్ష్మీనారాయణ లేవనెత్తారు. రాజకీయ ప్రత్యర్థులను అణగతొక్కేస్తూ, నియంతృత్వ పోకడలతో పాలన సాగిస్తున్న పుతిన్.. రష్యన్ల జాత్యంహకారాన్ని రెచ్చగొట్టి రాజ్యాధికారాన్ని పదిలం చేసుకోవాలని ఆరాట పడుతున్నాడని ఆయన చెబుతున్నారు.

పనికిరాని నిల్వలు..

ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన తర్వాత రష్యా అంతర్జాతీయంగా దాదాపు ఏకాకిగా మిగిలింది. అమెరికా, ఇతర యూరోప్​ దేశాలు ప్రకటించిన ఆర్థిక ఆంక్షలతో ఇప్పటికే పలు సవాళ్లను రష్యా ఎదుర్కొంటోంది. ఈ ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థను పతనం అంచుకు తీసుకెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ పరిణామాన్ని అసలు ఉహించినట్లు లేదు. పుతిన్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, మిగిలిన భద్రతా మండలి, 11 మంది కీలక అధికారులపై వ్యక్తిగత ఆంక్షలు కూడా విధించాయి. ఈ విధంగా ఒక దేశాధినేతపై ఆంక్షలు విధించడం చాలా అరుదు. 

ఎలాంటి సంక్షోభాలనైనా ఎదుర్కొనేందుకు వీలుగా విదేశీ మారక ద్రవ్యాన్ని, బంగారాన్ని పెద్ద ఎత్తున రష్యా పోగు చేసుకుంది. 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఈ నిల్వలను విపరీతంగా పెంచుకుంది. అయితే  ఆ నిల్వలన్నిటినీ విదేశీ బ్యాంకుల్లో దాచడంతో ఆర్థిక ఆంక్షల కారణంగా అవి అక్కరకు రాని పరిస్థితులు నెలకొన్నాయి. 

రష్యాతో కొంత వాణిజ్యాన్ని కొనసాగించడం ద్వారా చైనా సహాయపడవచ్చు. అయితే రూబుల్ దాదాపు పనికిరానిది. అది నిలకడలేనిది కావచ్చు. గతంలో కొన్ని దేశాలు ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, ఇంత స్థాయిలో ఎప్పుడూ జరగలేదు. ఇలాంటి చర్యలతో ఇరాన్, అఫ్గానిస్తాన్, వెనిజులా దెబ్బతిన్నాయి. 

రష్యా ప్రపంచంలోని టాప్ 12 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి, బ్రెజిల్, ఆస్ట్రేలియా కంటే పెద్దది. ఆంక్షలకు ప్రతిస్పందనగా పుతిన్  యూరోప్​కు గ్యాస్ ఎగుమతులను నిలిపివేయడం ద్వారా యూరోపియన్లను స్తంభింపచేసే అవకాశం ఉంది. తద్వారా రష్యా కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. 

కీలుబొమ్మ ప్రభుత్వం కోసం ప్రయత్నం 

ఉక్రెయిన్​లో కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేయడమే పుతిన్ తక్షణ లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ఉక్రెయిన్​లో తమ దేశ సైనికులకు వ్యతిరేకంగా పౌరులు కూడా తిరగబడడాన్ని రష్యా విస్మరించలేదు. అంటే కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, బలప్రయోగం ద్వారా ఎక్కువకాలం మనుగడ సాగించడం కష్టం కావచ్చు. 

ఉక్రెయిన్ యూరోపియన్​ యూనియన్ సభ్యత్వం కోరడం, అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ లో పుతిన్ పై యుద్ధ నేర ఆరోపణలు రావడం వంటి పరిణామాలతో పాటు యునైటెడ్​ నేషన్స్​ భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వాన్ని తొలగించే ప్రయత్నాలు ప్రారంభం కావడం ఒక విధంగా రష్యాకు ఊహించని పిడుగుపాటే. ఉక్రెయిన్​ను అమెరికా, యూరోప్​ దేశాలకు దూరంగా నెట్టడం కోసం ప్రారంభించిన యుద్ధం, ఆ దేశాలకు మరింత సన్నిహితం చేస్తోంది.

 2013లో రష్యా అనుకూల విధానాలు అనుసరించడంతో ప్రజాగ్రహం కారణంగా ఉక్రెయిన్​ అధ్యక్ష పదవిని కోల్పోయి ఇప్పుడు రష్యాలో ఆశ్రయం తీసుకొంటున్న విక్టర్‌‌‌‌ యానుకోవిచ్‌‌‌‌ను మరోసారి అధ్యక్షుడిగా చేయాలని పుతిన్ ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

జాతుల సమస్య పరిష్కార భావన భ్రమే..

యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ (యూఎస్ఎస్ఆర్)లో జాతుల సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందన్న వాదన నమ్మనని అప్పుడే ఎనలిస్ట్​ లక్ష్మీనారాయణ చెప్పారు. ఆ భావన ఒక భ్రమ మాత్రమేనని నేడు రూఢీ అయ్యింది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై 15 స్వతంత్ర దేశాలు ఆవిర్భవించాయి. 

జాతుల సమస్య పరిష్కారం కాలేదు సరికదా, కనీసం జాతుల మధ్య సుహృద్భావ సంబంధాలు కూడా స్థిరపడలేదని 1991 తర్వాత పరిణామాలు రుజువు చేస్తున్నాయి. తాజాగా రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ఆజ్యం పోసిన అంశాల్లో జాతుల ఆధిపత్య పోరు కూడా కీలకమైన అంశంగా భోదపడుతోందని ఆయన తెలిపారు. దీన్ని జీర్ణించుకోవడం కాస్త కష్టమే. అయినా, చరిత్ర నుంచి సరియైన పాఠాలను నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

(వి6 వెలుగు నుండి)