కైవ్‌లో మరో భారతీయ విద్యార్థిపై కాల్పులు

ఉక్రెయిన్ దేశంలోని కైవ్ నగరంలో రష్యా సైనికులు జరిపిన కాల్పుల్లో మరో భారతీయ విద్యార్థి గాయపడ్డారు. కైవ్ నగరంలో బుల్లెట్ గాయమైన భారతీయ విద్యార్థిని ఆసుపత్రికి తరలించామని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి జనరల్ వీకే సింగ్ పోలాండ్ విమానాశ్రయంలో చెప్పారు. 

గతంలో రష్యా సైనికులు జరిపిన కాల్పుల్లో ఓ భారతీయ విద్యార్థి మరణించగా, మరో విద్యార్థి గాయపడ్డారు. కైవ్ నగరంలో ఉంటున్న భారతీయ విద్యార్థి కాల్పుల్లో గాయపడినట్లు కేంద్ర మంత్రి సింగ్ చెప్పారు. ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధం నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం భారతీయులను అక్కడి నుంచి తరలిస్తోంది.

భారత విద్యార్థులు ఉక్రెయిన్ దేశం నుంచి పారిపోయి పోలాండ్ దేశ సరిహద్దులకు చేరుకుంటున్నారు.నలుగురు కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య ఎం సింధియా, కిరణ్ రిజిజు, జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ లు ఉక్రెయిన్‌కు ఆనుకుని ఉన్న దేశాల్లో భారతీయుల తరలింపు ప్రయత్నాలను పర్యవేక్షిస్తున్నారు.

ఇలా ఉండగా, ఉక్రెయిన్ దేశంలోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రంపై శుక్రవారం తెల్లవారుజామున రష్యా సైనికులు దాడి చేశారు. ఐరోపా  ఖండంలోనే అతి పెద్ద అణు కర్మాగారమైన జపోరిజ్జియాలో రష్యా సైనికులు అన్ని వైపుల నుంచి కాల్పులు జరిపారు. ఈ కాల్పులతో అణు విద్యుత్ ప్లాంట్ అగ్నికి ఆహుతైంది. 

అణు విద్యుత్ కేంద్రంలోనుంచి పొగలు రావడం గమనించానని సమీపంలోని ఎనర్‌గోదర్ నగర మేయర్ చెప్పారు. అణు కర్మాగారం అన్ని వైపుల నుంచి రష్యా దాడులు ప్రారంభించిందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా తెలిపారు.అణు కేంద్రం వద్ద ఉక్రెయిన్ బలగాలకు, రష్యన్ దళాలకు మధ్య తీవ్రమైన పోరాటం జరిగింది. అణు విద్యుత్ కేంద్రాన్ని పేల్చివేస్తే దాని వల్ల తీవ్ర ప్రమాదం జరుగుతుందని మంత్రి హెచ్చరించారు.