రెండు దశాబ్దాల్లో ప్రపంచంపై గ్లోబల్ వార్మింగ్ పెను ప్రభావం

గ్లోబల్‌ వార్మింగ్‌ రానున్న రెండు దశాబ్దాల్లో ప్రపంచంపై పెను ప్రభావాన్ని చూపిస్తుందని  ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ (ఐపిసిసి) నివేదిక హెచ్చరించింది.   
 
1.5 డిగ్రీల సెల్సియస్‌ గ్లోబల్‌ వార్మింగ్‌తో రాబోయే రెండు దశాబ్దాల్లో అనివార్యమైన విపరీతమైన వాతావరణ ప్రమాదాలను ప్రపంచం ఎదుర్కుంటుందని, ఈ స్థాయిని అధిగమించడం వల్ల అదనపు, తీవ్రమైన ప్రభావాలతో పాటు కొన్ని కోలుకోలేనివిగా ఉంటాయని నివేదిక తెలిపింది. 
 
వాస్తవానికి 2021 సెప్టెంబరులో విడుదల కావాల్సిన ఈ నివేదిక కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యమైంది. వాతావరణ-సంబంధిత విపత్తులపై గత అంచనాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు.
 
 ‘ఈ నివేదిక నిష్క్రియాత్మక పరిణామాల గురించి భయంకరమైన హెచ్చరిక’ ఐపిసిసి చైర్‌ హోసంగ్‌ లీ తెలిపారు. ‘వాతావరణ మార్పు మన మంచిగా ఉన్న, ఆరోగ్యకరమైన గ్రహానికి తీవ్రమైన, పెరుగుతున్న ముప్పు అని నివేదిక చూపిస్తుంది. తీవ్రమైన వాతావరణ ప్రమాదాలకు ప్రకృతి ఎలా ప్రతిస్పందిస్తుందో, ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారో ప్రస్తుత మన చర్యలు తెలియచేస్తాయి’ అని చెప్పారు.

మానవ-ప్రేరిత వాతావరణ మార్పులతో మరింత తరచుగా, తీవ్రమైన విపరీత సంఘటనలతో సహా, సహజ వాతావరణ వైవిధ్యానికి మించి, ప్రకృతికి- ప్రజలకు విస్తృతమైన ప్రతికూల ప్రభావాలు, నష్టాలు కలిగాయని నివేదిక తెలిపింది. కొన్ని అభివృద్ధి, అనుసరణ ప్రయత్నాలు హానిని తగ్గించాయని అయితే కొన్ని ప్రాంతాల్లో వ్యక్తులు, వ్యవస్థలు అసమానంగా ప్రభావితమవుతున్నాయని నివేదిక తెలిపింది. 

 
భారతదేశానికి చెందిన శాస్త్రవేత్తలు కూడా ఉన్న ఈ నివేదిక ప్రకటన ప్రకారం తీవ్రమైన వాతావరణ మార్పులు ప్రకృతి సహజ సామర్థ్యానికి మించి ఉండటం వల్ల కొన్ని కోలుకోలేని ప్రభావాలకు దారితీశాయి.
సముద్ర మట్టాలు 5 మీటర్ల వరకు పెరగొచ్చు 
 
వివిధ దేశాల్లో ప్రభుత్వాలు తమ ఉద్గారాల తగ్గింపు వాగ్దానాలను అమలు చేస్తేనే ప్రపంచ సముద్ర మట్టాలు ఈ శతాబ్దంలో 44-76 సెంటీమీటర్లు వరకూ పెరుగుతాయి. వేగవంతమైన ఉద్గార తగ్గింపుతో పెరుగుదల 28-55 సెంటీమీటర్లుకు పరిమితం చేయచ్చు. కానీ అధిక ఉద్గారాలతో, మంచు పలకలు ఊహించిన దానికంటే త్వరగా కూలిపోతే, సముద్ర మట్టాలు ఈ శతాబ్దంలో 2 మీటర్ల వరకు, 2150 నాటికి 5 మీటర్ల వరకు పెరగొచ్చు.
 
 ‘2050 నాటికి మన భూమి 1.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుందని అంచనా. . తీవ్రమైన గ్లోబల్‌ వార్మింగ్‌తో మూడు ప్రధాన సమస్యలు ఉంటాయని కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌ (సిఇఇడబ్ల్యూ) సిఇఒ అరుణాభా ఘోష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
మొదటిది వేగవంతమైన వాతావరణ సంక్షోభంతో నీటి ఎద్దడి, నీటి వ్యాధులు సంభవిస్తాయని, రెండోది వాతావరణ మార్పులతో ఆహారోత్పత్తి, ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు. మూడోది కరువులు, వేడి గాలులు జీవవైవిధ్య నష్టాన్ని, అలాగే మానవ వలసలను ప్రేరేపిస్తాయని తెలిపారు.