భారతీయుల కోసం ఉక్రెయిన్ కు 50 విమానాలు

ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియను ముమ్మరం చేసింది కేంద్రం. ఆపరేషన్ గంగా కార్యక్రమంలో భాగంగా.. ఇప్పటివరకు 14 విమానాల్లో భారతీయులు, పౌరులను తరలించారు. ఇవాళ ఐదు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఉదయం ఇస్తాంబుల్ నుంచి 220 మంది  ఢిల్లీకి వచ్చారు. 

ఎయిర్ పోర్టులో విద్యార్థులకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్వాగతం పలికారు. పోలాండ్ నుంచి 2 ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి భారతీయులు వచ్చారు. పోలాండ్ నుంచి ఫ్లైట్ లో వచ్చిన విద్యార్థులకు…. ఎయిర్ పోర్టులో కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. ఉక్రెయిన్ లోని విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా…ఎప్పటికప్పుడు కేంద్రమంత్రులు అక్కడున్న భారతీయ రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఈనెల 8 వరకు మొత్తం 50 విమానాల ద్వారా భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తుంది కేంద్రం. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు ప్రత్యేక విమానాలు పంపుతుంది. బుడాపెస్ట్ కు 10, బుకారెస్టుకు 29, పోలాండ్ కు 10 ప్రత్యేక విమానాలు నడపనుంది కేంద్రం. 

ఎయిర్ ఫోర్స్ కు చెందిన 2 సీ- 17 విమానాలు రోమేనియా, హంగేరీలకు వెళ్లాయి. ఉత్తరప్రదేశ్ గాజియాబాద్ లోని హిందాన్ ఎయిర్ బేస్ నుంచి 2 ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ బయల్దేరి వెళ్లినట్లు తెలిపారు అధికారులు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థుల కోసం నిత్యావసర సరకులు, దుప్పట్లు, మెడిసిన్ తీసుకొని వెళ్లింది సీ-17 విమానం.

కాగా, అపరేషన్ గంగ కార్యక్రమంలో భాగంగా గత 24 గంటల్లో 6 విమానాలు భారత్‌కు బయలుదేరాయని, ఒక్కరోజే 1377 మంది భారత పౌరులను ఉక్రెయిన్ నుంచి భారత్‌కు తరలించామని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ బుధవారంనాడు ఒక ట్వీట్‌లో తెలిపారు.

ఇలా ఉండగా, ఉక్రయిన్‌లోని ఖార్కివ్ సిటీపై రష్యా బలగాలు  జరుపుతున్న దాడిలో గాయపడిన హవేరి జిల్లా విద్యార్థి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. ఖార్కివ్ నగరంపై మంగళవారం రష్యా సైనం జరిపిన క్షిపణి దాడిలో 22 ఏళ్ల శేఖరప్ప గ్యానగౌడర్ నవీన్ ప్రాణాలు కోల్పోవడం ఇప్పటికే కర్ణాటకలో విషాదం నిపింది.

 ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి మొదలు పెట్టినప్పటి నుంచి అక్కడి భారతీయులు మరణించడం తొలిసారి. కాగా, ఇదే దాడిలో హవరే జిల్లా విద్యార్థి గాయపడిన విషయంపై ముఖ్యమంత్రి  మాట్లాడుతూ, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. 

అతను సురక్షితంగానే ఉన్నట్టు ఒక సమాచారం ఉండగా, గాయపడినట్టు మరో సమాచారం ఉందని, ధ్రువీకరణ కోసం వేచిచూస్తున్నామని చెప్పారు. ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు  సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు.