ఉక్రెయిన్‌లో భారతీయులందరినీ వెనక్కి తెస్తాం

యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులందరినీ వెనక్కి తీసుకువచ్చేందుకు కేంద్రం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచఃరు. ఉత్తరప్రదేశ్‌లో మార్చి 3న జరుగనున్న ఆరో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని బస్తిలో ఆదివారం ఏర్పాటు చేసిన ర్యాలీలో మోదీ పాల్గొన్నారు.
 
 విపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ దేశభక్తికి, పరివార్ భక్తి (కుటుంబ భక్తి)కి చాలా తేడా ఉందని చెప్పారు. గత కుటుంబ పాలకులు రక్షణావసరాల కోసం విదేశాలపై ఆధారపడేవని, కానీ ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్‌కే తాము ప్రాధాన్యమిస్తున్నామని ప్రధాని చెప్పారు. కులమతాలకు అతీతంగా దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్‌గా రూపొందించే సమయమిదేనని స్పష్టం చేశారు. 
 
”మనకు  ఆయిల్ రిఫైనరీలు లేవు. క్రూడాయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. వాళ్లు ఎప్పుడూ దీనిపై దృష్టిపెట్టలేదు. ఇప్పుడు చెరకు సాయంతో ఇథనాల్ ఉత్పత్తి చేస్తున్నాం. ఇథనాల్ ప్లాంట్ నెట్‌వర్క్‌ను మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది” అని గుర్తు చేశారు. 
 
దశాబ్దాలుగా పరివార్‌వాదీలు మన సైన్యాన్ని ఇతరదేశాలపై ఆధారపడేలా చేశారని విమర్శించారు. భారత రక్షణ రంగాన్ని ధ్వంసం చేశారు. కానీ, ఇవాళ యూపీలో మేము రక్షణ కేరిడార్ ఏర్పాటు చేశమని ప్రధాని తెలిపారు.  ఫిబ్రవరి 26వ తేదీని బాలాకోట్‌పై గగనతల దాడులు చేసిన రోజుగా దేశం జరుపుకొంటోందని, కానీ ఆనువశం పాలకులు మాత్రం దాడులకు రుజువులు అడుగుతోందని మోదీ విమర్శించారు. 
 
ఎస్పీ అధికారంలో ఉండగా ప్రజలను పట్టించుకోలేదని అన్న మోదీ వైద్య సదుపాయాలు లేక ఎంతో మంది బ్రెయిన్ ఫీవర్‌తో మరణించారని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 18 మెడికల్ కాలేజీలు నిర్మించిందని, మరో 20 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. 
 
 తాము ఎయిమ్స్ నిర్మించామని చెబుతూ  పేద విద్యార్థులకు వైద్య విద్యను అందిస్తున్నామని ప్రధాని తెలిపారు. అది కూడా వారి మాతృభాషలోనే అందిస్తున్నామని పేర్కొన్నారు. చాలా కాలం క్రితం యూపీలో అతి తక్కువ కాలంలో 9 మెడికల్ కాలేజీలకు తాను స్వయంగా  శంకుస్థాపన చేసిన్నట్లు గుర్తు చేశారు. 
 
అందుకో దోరియాలో నిర్మించిన మహర్షి దేవ్రహ బాబా ఆటోనామస్ స్టేట్ మెడికల్ కాలేజీ ఒకటని చెప్పారు. ఇంతకు ముందు ప్రభుత్వం ఈ పని ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు. “ఎందుకంటే వారికి కుటుంబం మాత్రమే ముఖ్యం. మేము దేశం కోసం పని చేస్తాం కాబట్టే ప్రజావసరాలను గుర్తించి పని చేస్తున్నాం’’ అని మోదీ ధ్వజమెత్తారు.  కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా సంత్ కబీర్ నగర్, సిద్ధార్ధ్‌నగర్, అంబేద్కర్ నగర్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రధాని ఆదివారం ప్రచారం చేస్తున్నారు.