ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన మాండవీయ

ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సూఖ్ మాండ‌వీయ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఐదేండ్ల లోపు చిన్నారుల‌కు కేంద్ర మంత్రి పోలియో చుక్క‌ల‌ను వేశారు. ప్ర‌తి చిన్నారికి పోలియో చుక్క‌లు వేయించాల‌ని త‌ల్లిదండ్రుల‌కు మాండ‌వీయ విజ్ఞ‌ప్తి చేశారు. 
 
పోలియో మహమ్మారిని తరిమివేసేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఈ నెల 27వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శుక్రవారం రాష్ట్ర ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. 
 
పల్స్ పోలియోలో భాగంగా 0-5 ఏండ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నట్టు ఆయన చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ సెంటర్లు, అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, లైబ్రరీలు, బస్టాండ్లు, ఎయిర్ పోర్టులు, పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.
 
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సిబ్బంది వ్యాక్సిన్లు వేస్తారని చెప్పారు. ఆ తర్వాత రెండు రోజుల పాటు (సోమవారం, మంగళవారం) సిబ్బంది ఇంటింటికీ తిరిగి, ఇంకా ఎవరైనా టీకా వేసుకోనివారు ఉంటే గుర్తించి పోలియో వ్యాక్సిన్ వేస్తారని వివరించారు. 
 
మొత్తం మూడు రోజుల పాటు జరిగే ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో మొత్తం 38 లక్షల మందికిపైగా పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని వైద్యారోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. వైద్యారోగ్యశాఖ తో పాటు ఐసిడిఎస్, విద్య, పురపాలక, పంచాయతీ రాజ్ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 
 
ఈ బృహత్తర కార్యక్రమంలో మంత్రులు, ఎంఎల్‌ఎలు పాల్గొని, తమ నియోజకవర్గంలోని కేంద్రానికి వెళ్లి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించాలని మంత్రి హరీశ్ రావు కోరారు. ప్రజలంతా సహకరించాలని, ఐదేండ్లలోపు వయసున్న పిల్లలందరూ టీకాలు తీసుకునేలా చూడాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.