బిజెపిపై నిందలు వేసి పబ్బం గడుతుపున్న కేసీఆర్ 

దేశంలో మతకల్లోలాలు జరిగిపోతున్నాయని… దాని వల్ల పెట్టుబడులు ఆగిపోతాయని మొసలి కన్నీరు కార్చుతున్న సీఎం కేసీఆర్ గారు… తన పరిపాలనలో తెలంగాణలో జరుగుతున్న రైతుల, నిరుద్యోగుల, నిర్వాసితుల ఆత్మహత్యల పరంపరను మర్చిపోయి బీజేపీపై లేనిపోని నిందలు వేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని బిజెపి జాతీయ   సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు. 
గత ఏడేళ్ళుగా కేంద్రంలోను… అదే సమయంలో… అంతకుముందు…   పలు విడతలు వివిధ రాష్ట్రాలలో బీజేపీ అధికారపార్టీగా కొనసాగుతూ వస్తోందని చెబుతూ బీజేపీ పట్ల ప్రజల ఆదరాభిమానాలు ఉన్నందువల్లే ఇదంతా సాధ్యమైందని ఆమె తెలిపారు. మరి బీజేపీ పాలనలోని ఏ రాష్ట్రంలో ఏ పెట్టుబడులు ఆగిపోయాయో, ఎక్కడ అభివృద్ధి నిలిచిపోయిందో, ఎక్కడ మతకలహాలు జరిగాయో కేసీఆర్ చెప్పగలరా? అంటూ ఆమె ప్రశ్నించారు. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతోంది కూడా విద్యాసంస్థల్లో డ్రెస్ కోడ్‌కి సంబంధించిన అంశమే తప్ప మతకలహాలు కాదని కేసీఆర్ గుర్తించాలని ఆమె హితవు చెప్పారు. ఆయన ఉద్దేశ్యపూర్వకంగా మతకలహాల రంగు పులుముతున్నారని ఆమె మండిపడ్డారు. మరి బీజేపీ పాలిత ఏ రాష్ట్రంలోనూ మతకలహాలు లేనప్పుడు తెలంగాణలో మాత్రం బీజేపీ అధికారంలోకి వస్తే మతకలహాలు వస్తాయని కేసీఆర్ వ్యాఖ్యానించడంలో ఉద్దేశ్యమేంటి? అంటూ ఆమె నిలదీశారు. 
 
రేపు బీజేపీ ఇలాగే బలోపేతమైతే తమ సయామీ కవల పార్టీ అయిన ఎంఐఎంతో కలసి టిఆరెస్సే మతకలహాలు సృష్టించి, దాన్ని బీజేపీ మీద నెట్టే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోందని ఆమె ఆరోపించారు.  తెలంగాణలో తన కాలి కింద భూమి కదులుతుండటంతో అధికారం చేజారిపోతుందేమోనని కేసీఆర్ గారికి భయం పట్టుకుందని ఆమె ఎద్దేవా చేశారు. 
 
తెలంగాణలో బీజేపీ నానాటికి ప్రజాదరణ పొందుతూ వేళ్ళూనుకుంటుండటంతో ఆయన జీర్ణించుకోలేకపోతున్నరని విజయశాంతి విమర్శించారు. 2019 ఎన్నికలప్పుడు కూడా ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ చేసిన స్టంట్ ఫెయిలై చతికిలబడిన సంగతి అందరికీ తెలుసని ఆమె చెప్పారు.  బంగారు తెలంగాణ అంటూ రాష్ట్రాన్ని బంజరుగా మార్చిన కేసీఆర్ సత్తా ఏంటో జాతీయ స్థాయిలో అందరికీ తెలుసని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోనే కేసీఆర్‌ని నమ్మే పరిస్థితి లేనప్పుడు… జాతీయ స్థాయిలో ఆయన్ని నమ్మేదెవరో చెప్పాల్సిన పనిలేదని ఆమె స్పష్టం చేశారు.