బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కేసులో ఆరుగురు  అరెస్ట్ 

కర్ణాటక శివమొగ్గ జిల్లాలో జరిగిన భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్యకేసులో ఇంతవరకు సుమారు 12 మందిని పోలీసులు అదుపు లోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరిలో ఆరుగురిని అరెస్టు చేశారు. వీరంతా ఇరవై ఏళ్ల లోపు వారే. వీరిలో నిందితులు ఖాషిఫ్, సయ్యద్ నదీమ్, ఆసిఫ్,రిహాన్‌లను గుర్తించారు. 
 
ఖాసిఫ్, నదీమ్ వీరిద్దరూ శివమొగ్గకు చెందిన వారే వీరి పూర్వచరిత్ర, ఇతర వివరాలు పరిశీలిస్తున్నారు. ఆదివారం రాత్రి శివమొగ్గ పట్టణం లోని భారతీనగర్‌లో భజరంగ్‌దళ్ కార్యకర్త హర్షను హత్య చేయడానికి కారులో ఏడుగురు వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
శివమొగ్గ లోనే మకాం వేసి ఉన్న అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి ప్రతాప్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ నిందితులందర్నీ గుర్తించామనిని, కొందర్ని అరెస్టు చేశామని, మిగతా వారిని కూడా వేగంగా అరెస్టు చేస్తామని చెప్పారు.
 
 హత్య జరిగిన తరువాత పట్టణం లోను పరిసర ప్రాంతాల్లోను ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపు లోకి తేడానికి అదనపు బలగాలు శివమొగ్గకు తరలి వెళ్లాయి.  హత్య జరిగిన తరువాత పట్టణం లోను పరిసర ప్రాంతాల్లోను ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపు లోకి తేడానికి అదనపు బలగాలు శివమొగ్గకు తరలి వెళ్లాయి. 
ఈ కేసుపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతుందనిరాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర  చెప్పారు. హిజాబ్ వివాదం, మత సంస్థల పాత్ర, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? వాహనాన్ని ఎవరు సమకూర్చారు? వంటి అంశాలపై దర్యాప్తు జరుగుతుందని వివరించారు.  ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరగకూడదని ఆయన కోరారు.
పోలీసులు తమ విధులను నిర్వహించారని చెప్పారు. ప్రశాంతతకు విఘాతం కలిగించేందుకు ఎటువంటి అవకాశాన్నీ ఇవ్వవద్దని కోరారు. నేరగాళ్ళను ప్రభుత్వం కచ్చితంగా అరెస్టు చేస్తుందని, తగిన శిక్ష పడే విధంగా చేస్తుందని హామీ ఇచ్చారు. హర్ష హత్యతోనే ఇటువంటి హత్యలకు ఫుల్ స్టాప్ పడాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వం, పోలీసు శాఖ దీని కోసమే కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసుకు తార్కిక ముగింపు ఇవ్వడానికి కృషి చేస్తున్నామని, ప్రజలకు ఎటువంటి సందేహాలు అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఉన్నతాధికారులు శివమొగ్గకు వచ్చారని, దర్యాప్తు బృందానికి ప్రత్యేక మార్గదర్శనం చేస్తున్నారని తెలిపారు. రాళ్లు విసిరిన వారిపై కూడా కేసులు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతామని, తగిన విధంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.
ఈ హత్య వెనుక కుట్ర ఉన్నదని రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వరప్ప, కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఆరోపించారు. విద్యాసంస్థలలో జిహాదీని వ్యతిరేకిస్తున్నందుకే హర్షను జిహాదీ శక్తులు హతమార్చిన్నట్లు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ ఆరోపించారు. ఈ హత్యకు రాష్ట్రంలో నెలకొన్న హిజాబ్ వివాదంతో సంబంధం ఉన్నదని రాష్ట్ర మంత్రి ఆర్ అశోక్ స్ఫష్టం చేశారు.
ఇదిలావుండగా, శివమొగ్గ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఆర్ సెల్వమణి తెలిపిన వివరాల ప్రకారం, ఈ జిల్లాలో కర్ఫ్యూను పొడిగించారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే ప్రజలు తమ అవసరాల కోసం బయటికి రావచ్చు. సెక్షన్ 144 ప్రకారం ఆంక్షలను  మరో రెండు రోజులు అంటే శుక్రవారం ఉదయం వరకు పొడిగించారు. కర్ఫ్యూ అమల్లో ఉన్న రోజుల్లో పాఠశాలలను మూసివేస్తారు.
కాగా బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్విసూర్య మంగళవారం భారీ పోలీసుబందోబస్తు నడుమ హర్ష కుటుంబీకులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. శివమొగ్గ ఘటనకు ఎస్‌డీపీఐ, పీఎఫ్‌ఐ సంఘాలే కారణమని ఆరోపించారు. నిందితులను ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు.