ఉక్రెయిన్ సంక్షోభంపై భద్రతా మండలి అత్యవసర భేటీ

రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణంపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యవసర సమావేశం అయ్యింది. ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై రష్యా దాడి చేస్తోందని భద్రాతామండలిలో అమెరికా  రాయబారి లిండా థామస్ఆరోపించారు. అంతర్జాతీయ చట్టం ప్రాధమిక  సూత్రాన్ని రష్యా ఉల్లంఘిస్తోందని విమర్శించారు. 

 సమస్యను దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భద్రతామండలిలో భారత శాశ్వాత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి స్పష్టం చేశారు. సంయమనం పాటించాలని ఇరుదేశాలకు సూచించారు. రష్యన్ ఫెడరేషన్ తో ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పెరగడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. 

ఈ పరిణామాలు ఉక్రెయిన్ లో శాంతి, భద్రతలతో పాటు ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ లో సుమారు 20 వేల మందికి పైగా భారతీయులు స్టూడెంట్స్ ఉన్నారని, వారి భద్రత తమకు ఆద్యాధిక ప్రాధాన్యత అని తెలిపారు. వీలైనంత త్వరగా రష్యా, ఉక్రెయిన్ రెండు పక్షాలు దౌత్యపరంగా చర్చించుకుని ఉభయ తారకమైన పరిష్కారానికి రావాలని ఆయన సూచించారు.

ఇలా ఉండగా, ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగే ఆలోచన లేదంటూనే సంక్షోభాన్ని మరింత పెంచే చర్యలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ దిగుతున్నారు. తూర్పు ఉక్రెయిన్ లో వేర్పాటువాదుల ఆదీనంలోని రెండు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తించాలని పుతిన్ నిర్ణయించారు. డోనెట్స్ కో, లుహాన్స్ కో ను స్వతంత్ర స్టేట్స్ గా గుర్తిస్తూ ఫైల్ పై సంతకం చేశారు.

జాతిని ఉద్దేశించి ప్రసంగించిన పుతిన్.. అమెరికాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రష్యాను బలహీనపర్చే చర్యలకు అమెరికా దిగుతోందని పుతిన్ ఆరోపించారు. రష్యాపై దాడి చేయించేందుకు ఉక్రెయిన్ ను పావుగా వాడుకుంటుందని విమర్శించారు.

ఉక్రెయిన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయని.. ఏ సమయంలోనేనా దాడి చేసే ప్రమాదం ఉందని పుతిన్  తెలిపారు నాటో హెడ్ క్వార్టర్స్ నుంచి ఉక్రెయిన్ ఆర్మీకి ఆదేశాలు అందుతున్నాయని పేర్కొన్నారు. తమపై దాడికి వస్తే తిప్పికొడతామని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు.

మరోవైపు పుతిన్ నిర్ణయంపై ఉక్రెయిన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలు రష్యా దూకుడును అడ్డుకోవాలని కోరింది. తాము ఎవరికీ భయపడమని ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. మాస్కో శాంతి చర్చలను ధ్వంసం చేశారని.. ప్రాదేశిక రాయితీలు ఇవ్వకూడదని జెలెన్స్కీ ఆరోపించారు.

మరోవంక, స్వతంత్ర దేశాలుగా రష్యా ప్రకటించిన తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు ప్రాంతాలపై అమెరికా ఆంక్షలను విధించేందుకు సిద్ధమైంది. ఆ ప్రాంతాలపై ఆర్థిక ఆంక్షలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ప్రకటించారు. డొనెట్స్‌, లుహాన్స్క్‌ ప్రాంతాలతో అమెరికా ఎటువంటి వ్యాపారాలు చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. 

ఆ ప్రాంతాల్లో అమెరికా వాసులు ఎటువంటి పెట్టుబడులు పెట్టరని, ఆ ప్రాంతానికి చెందిన సరుకులు, ఇతర సేవలను, టెక్నాలజీని ఏ రూపంలోనూ అమెరికా దిగుమతి చేసుకోకూడదని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని తగ్గించేలా పాలసీలు చేసిన ఐదుగురు డుమా సభ్యులు(రష్యా పార్లమెంట్‌ దిగువసభ)పై కూడా  ఆంక్షలు విధించారు.